Asianet News TeluguAsianet News Telugu

INDvsSA 3rd Test: 111 పరుగులు, 8 వికెట్లు... సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే...

మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసిన సౌతాఫ్రికా... సఫారీ జట్టుకి మరో 111 పరుగులు, టీమిండియాకి 8 వికెట్లు... 

INDvsSA 3rd Test: South Africa lost two wickets, Need 111 Runs, Team India need
Author
India, First Published Jan 13, 2022, 9:43 PM IST

INDvsSA 3rd Test: సిరీస్ డిసైడర్‌‌ మూడో టెస్టు ఫలితం నాలుగో రోజు తేలిపోనుంది. 212 పరుగుల టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. నాలుగో రోజు సౌతాఫ్రికా విజయానికి 111 పరుగులు అవసరం రాగా, టీమిండియా గెలవాలంటే 8 వికెట్లు కావాల్సి ఉంది...

22 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్‌ను మహ్మద్ షమీ అవుట్ చేయడంతో 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా... అదే ఓవర్‌లో డీన్ ఎల్గర్ ఇచ్చిన అందుకోవడంలో విఫలమయ్యాడు పూజారా. లేకపోతే వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయేది సఫారీ జట్టు...

డీన్ ఎల్గర్, కీగన్ పీటర్సన్ కలిసి రెండో వికెట్‌కి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, జట్టును పటిష్ట స్థితికి చేర్చారు... 96 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేసిన డీన్ ఎల్గర్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
 
కీగన్ పీటర్సన్ 61 బంతుల్లో 7 ఫోర్లతో 48 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు జట్టు స్కోరు 60 పరుగులు ఉన్నప్పుడు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు ప్రకటించాడు అంపైర్... అయితే వెంటనే డీన్ ఎల్గర్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టుగా చూపించింది...

బేసిక్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ఎవ్వరికైనా ఆ బంతి వికెట్లను తాకుతుందని తెలుస్తుంది. కనీసం అంపైర్ కాల్స్‌గా అయినా అవుతుందని అర్థం అవుతుంది... దీంతో కాసేపు హై డ్రామా నడిచింది. 

అంతకుముందు  రిషబ్ పంత్ అద్భుత సెంచరీ ఇన్నింగ్స్ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 13 పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి సౌతాఫ్రికాకి 212 పరుగుల టార్గెట్‌ను సెట్ చేసింది టీమిండియా...

ఓవర్‌నైట్ స్కోరు 57/2తో మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టి మొదటి రెండు ఓవర్లలోనే పూజారా, రహానే వికెట్లు కోల్పోయిన టీమిండియాని విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులతో లంచ్ బ్రేక్‌కి వెళ్లింది టీమిండియా...

కోహ్లీ, రిషబ్ పంత్ కలిసి ఐదో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే, అందులో విరాట్ చేసింది 15 పరుగులే... పూర్తిగా రిషబ్ పంత్ డామినేషనే కనిపించింది. లంచ్ బ్రేక్ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది టీమిండియా. 143 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, లుంగి ఇంగిడి బౌలింగ్‌లో మార్క్‌రమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 152 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు...

ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 15 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి లుంగి ఇంగిడి బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ 10 బంతుల్లో డకౌట్ అయ్యాడు...

ఆ తర్వాత మహ్మద్ షమీ కూడా 10 బంతులాడి పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు. 189 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది భారత జట్టు. రబాడా బౌలింగ్‌లో ఫోర్ బాది 98 పరుగులకు చేరుకున్న రిషబ్ పంత్, ఆఖరి బంతికి సింగిల్ తీశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

సౌతాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. 2010లో సెంచూరియన్‌లో 90 పరుగులు చేసిన ఎమ్మెస్ ధోనీ రికార్డును అధిగమించాడు రిషబ్ పంత్...

ఇంగ్లాండ్‌లో (114), ఆస్ట్రేలియాలో (159) పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా నిలిచిన రిషబ్ పంత్, సౌతాఫ్రికా గడ్డ మీద కూడా ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

133 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ మార్కును అందుకున్నాడు రిషబ్ పంత్. సౌతాఫ్రికాలో సెంచరీ చేసిన మొదటి ఆసియా వికెట్ కీపర్‌గా నిలిచిన రిషబ్ పంత్, ఒకే ఇన్నింగ్స్‌లో రెండు కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన భారత వికెట్ కీపర్‌గానూ నిలిచాడు...

మూడో రోజు టీమిండియాకి మొదటి ఓవర్ రెండో బంతికే షాక్ తగిలింది. 33 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత 9 బంతుల్లో 1 పరుగు చేసిన అజింకా రహానే... కగిసో రబాడా బౌలింగ్‌లో డీన్ ఎల్గర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఆన్రీచ్ నోకియా గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో టెస్టు ఆరంగ్రేటం చేసిన మార్కో జాన్సెన్... పూజారా వికెట్‌తో 17 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఆరంగ్రేటం సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన సౌతాఫ్రికా బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు జాన్సెన్...

ఇంతకుముందు 1995-96లో ఇంగ్లాండ్‌పై ఆరంగ్రేటం చేసిన షాన్ పోలాక్ 16 వికెట్లు తీయగా, ఇప్పటికే 17 వికెట్లు తీసిన జాన్సెన్... 26 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు...

Follow Us:
Download App:
  • android
  • ios