INDvsSA 3rd ODI:  మూడో వన్డేలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ సెంచరీ... రస్సీ వాన్ దేర్ దుస్సేన్ కలిసి నాలుగో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పార్ల్ వేదికగా జరిగిన మొదటి రెండు వన్డేల్లో టాస్ గెలిచిన కెప్టెన్లు బ్యాటింగ్ ఎంచుకుంటే... కేప్ టౌన్‌లో జరుగుతున్న మూడో వన్డేలో మాత్రం కెప్టెన్ కెఎల్ రాహుల్ భిన్నంగా ఆలోచించాడు. టాస్ గెలిచిన తర్వాత సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించాడు...

మూడో వన్డేలో ఏకంగా నాలుగు మార్పులతో బరిలో దిగింది భారత జట్టు. మొదటి రెండు వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్‌ల స్థానంలో దీపక్ చాహార్, ప్రసిద్ధ్ కృష్ణ,జయంత్ యాదవ్‌లకు చోటు కల్పించిన భారత జట్టు... వెంకటేశ్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం ఇచ్చింది...

భువనేశ్వర్ కుమార్ స్థానంలో తుదిజట్టులో వచ్చిన దీపక్ చాహార్, తన రెండో ఓవర్‌ మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు. 6 బంతుల్లో ఒక్క పరుగు చేసిన జన్నేమన్ మలాన్, కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత భారత జట్టు బౌలర్లు, సింగిల్ డిజిట్ స్కోరు వద్ద వికెట్ తీయడం ఇదే తొలిసారి. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన సఫారీ కెప్టెన్ తెంప భవుమా, కెఎల్ రాహుల్ కొట్టిన డైరెక్ట్ త్రోకి రనౌట్ అయ్యాడు...

34 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత భారత బౌలర్లు 10 ఓవర్లలోపు రెండు వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే. 14 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్ కూడా దీపక్ చాహార్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (సబ్‌స్టిట్యూట్)కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

70 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. అయితే ఆ తర్వాత క్వింటన్ డి కాక్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్ కలిసి నాలుగో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. 108 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న క్వింటన్ డి కాక్, వన్డేల్లో 17వ సెంచరీ నమోదు చేశాడు...

భారత జట్టుపై క్వింటన్ డి కాక్‌కి ఇది ఆరో వన్డే సెంచరీ కావడం విశేషం. భారత జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు క్వింటన్ డి కాక్. శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 85 ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు చేస్తే, క్వింటన్ డి కాక్ కేవలం 16 ఇన్నింగ్స్‌ల్లోనే 6 సెంచరీలు చేశాడు...

ఒకే ప్రత్యర్థిపై అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఆరు సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు క్వింటన్ డి కాక్. న్యూజిలాండ్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 23 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు చేస్తే, క్వింటన్ డి కాక్ 16 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డును చేరుకున్నాడు...

అలాగే భారత జట్టుపై వన్డేల్లో 1000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు క్వింటన్ డి కాక్. ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ అందుకోగా, క్వింటన్ డి కాక్ ఆ రికార్డును సమం చేశాడు...