Asianet News TeluguAsianet News Telugu

INDvsSA 2nd ODI: రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు... శార్దూల్ ఠాకూర్ మెరుపులు, సౌతాఫ్రికా ముందు...

INDvsSA 2nd ODI: 85 పరుగులు చేసిన రిషబ్ పంత్... రాహుల్ ద్రావిడ్, ఎమ్మెస్ ధోనీ రికార్డు బద్ధలు కొట్టిన పంత్... 55 పరుగులు చేసిన కెఎల్ రాహుల్...

INDvsSA 2nd ODI: Rishabh pant, KL Rahul Half centuries, Shardul Thakur innings helped team India
Author
India, First Published Jan 21, 2022, 5:58 PM IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు, ప్రత్యర్థి ముందు పరుగుల టార్గెట్‌ను పెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 85 పరుగులతో ఆకట్టుకోగా కెఎల్ రాహుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ కలిసి టీమిండియాకి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 38 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసిన శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు...

శిఖర్ ధావన్ అవుటైన తర్వాతి ఓవర్లోనే విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 5 బంతులాడిన విరాట్ కోహ్లీ, కేశవ్ మహరాజ్ బౌలింగ్ సఫారీ కెప్టెన్ భవుమాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొదటి వన్డేలో కూడా విరాట్ కోహ్లీ ఇదే విధంగా అవుట్ కావడం విశేషం...

64 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టును రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్‌కి 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 79 బంతుల్లో 4 ఫోర్లతో 55 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మగల బౌలింగ్‌లో అవుట్ కాగా, 71 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేసిన రిషబ్ పంత్... షంసీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

రిషబ్ పంత్‌కి వన్డేల్లో ఇది నాలుగో హాఫ్ సెంచరీ కాగా ఇదే అతని అత్యుత్తమ స్కోరు.  కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ వెంటవెంటనే అవుట్ కావడంతో 183 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. శ్రేయాస్ అయ్యర్ 14 బంతుల్లో 11 పరుగులు చేసి తీవ్రంగా నిరాశ పరచగా... వెంకటేశ్ అయ్యర్ 33 బంతుల్లో ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేశాడు...

సౌతాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రిషబ్ పంత్. ఇంతకుముందు 2001లో రాహుల్ ద్రావిడ్‌ చేసిన 77 పరుగులను, 2013లో ఎమ్మెస్ ధోనీ చేసిన 65 పరుగుల రికార్డును అధిగమించాడు రిషబ్ పంత్...

చివర్లో శార్దూల్ ఠాకూర్ 38 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 24 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేయడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా. 

మొదటి వన్డేతో పోలిస్తే రెండో వన్డేలో సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్‌లో చాలా తప్పులు చేసింది. కెఎల్ రాహుల్ ఏకంగా మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగా వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్‌ ఇచ్చిన క్యాచులను కూడా ఒడిసి పట్టలేకపోయారు సఫారీ ఫీల్డర్లు...

మాజీ ఓపెనర్ సచిన్ టెండూల్కర్ 34 సార్లు డకౌట్ కాగా, మరో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 31 సార్లు డకౌట్ అయ్యాడు. మాజీ వన్ డౌన్ బ్యాట్స్‌మెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 29 సార్లు డకౌట్ అయ్యాడు... విరాట్ కోహ్లీకి ఇది 31వ డకౌట్. సెహ్వాగ్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ, 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ కొనసాగించిన సచిన్ టెండూల్కర్ రికార్డుకు చేరువలో ఉన్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios