Asianet News TeluguAsianet News Telugu

ఉప్పల్‌లో భయపెట్టిన బ్రేస్‌వెల్.. ఉత్కంఠపోరులో టీమిండియా స్టన్నింగ్ విక్టరీ..

INDvsNZ: ఉప్పల్ వేదికగా  భారత్-న్యూజిలాండ్ నడుమ నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన తొలి వన్డేలో భారత్.. 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.  భారీ లక్ష్య ఛేదనలో బ్రేస్‌వెల్, సాంట్నర్ లు  ఆఖరి ఓవర్ వరకూ పోరాడారు. 

INDvsNZ : Michael Bracewell Fight Vain, India beat New Zealand by 12 Runs
Author
First Published Jan 18, 2023, 9:57 PM IST

నాలుగేండ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా జరిగిన  వన్డే  భాగ్యనగర క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజాను అందించింది.  భారత్ -న్యూజిలాండ్ మధ్య  ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో  జరిగిన ఉత్కంఠ పోరులో విజయం భారత్‌నే వరించింది. భారీ లక్ష్య ఛేదనలో కివీస్   131కే ఆరు కీలక వికెట్లు కోల్పోయినా మైఖెల్ బ్రేస్‌వెల్   (78 బంతుల్లో 140, 12 ఫోర్లు, 10 సిక్సర్లు), మిచెల్ సాంట్నర్ (45 బంతుల్లో  57, 7 ఫోర్లు, 1 సిక్స్) లు  పోరాడారు. మ్యాచ్‌లో ఆ జట్టుకు ఆశలే లేని స్థితి నుంచి  ‘గెలవగలం’ అన్న  కోరిక కల్పించారు.  అయితే హైదరాబాదీ కుర్రాడు  మహ్మద్ సిరాజ్ సొంతగడ్డపై మాయ చేసి  టీమిండియాకు విజయాన్ని అందించాడు.  సిరాజ్ దెబ్బకు కివీస్.. 337 పరుగులకే పరిమితమైంది.  ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంతో నిలిచింది.  రెండో వన్డే ఈనెల 21న రాయ్‌పూర్ వేదికగా జరుగుతుంది. 

భారీ లక్ష్య ఛేదనలో   బ్యాటింగ్ కు వచ్చిన  న్యూజిలాండ్ కు సిరాజ్ తొలి షాక్ ఇచ్చాడు.  రెండు ఫోర్లు కొట్టి జోరుమీదున్న డెవాన్ కాన్వే (10) ను  షాట్ బంతికి  భారీ షాట్ ఆడి  ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కుల్దీప్ కు చిక్కాడు.  కాన్వే ఔటైనా మరో  ఓపెనర్ ఫిన్ అలెన్ (39 బంతుల్లో 40, 7 ఫోర్లు, 1 సిక్సర్) మాత్రం ధాటిగా ఆడాడు. 

వికెట్లు టపటప.. 

తొలుత ఇన్నింగ్స్ ను నెమ్మదిగా మొదలుపెట్టినా హార్ధిక్ పాండ్యా వేసిన కివీస్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో 4,6,4,4 బాదాడు. జోరుమీదున్న అలెన్ ను శార్దూల్ ఠాకూర్  పెవిలియన్ కు పంపాడు. దీంతో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానికి 70 పరుగులుగా ఉంది.  స్పిన్నర్  కుల్దీప్ యాదవ్ కివీస్ కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. అతడు వేసిన 16వ ఓవర్ రెండో బంతికి నికోలస్ (18) బౌండరీ బాదాడు.  కానీ మూడో బంతికి  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తన తర్వాతి ఓవర్లో కుల్దీప్.. డారిల్ మిచెల్ (9) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఫలితంగా న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 

వరుసగా వికెట్లు పడుతున్న నేపథ్యంలో  కివీస్ ఇన్నింగ్స్ నెమ్మదించింది.  కెప్టెన్ టామ్ లాథమ్ తో పాటు ఫిలిప్స్ కూడా  వికెట్ల పతనాన్ని అడ్డుకోవడానికి యత్నిస్తూ  సింగిల్స్ మీద ఫోకస్ పెట్టారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు 41 బంతుల్లో 21 పరుగులు  జోడించారు.  అయితే  షమీ ఈ జోడీని విడదీశాడు.   అతడు వేసిన  25వ ఓవర్ మూడో బంతికి గ్లెన్ ఫిలిప్స్ (11) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  సిరాజ్ వేసిన 29వ ఓవర్లో కెప్టెన్ టామ్ లాథమ్  (46 బంతుల్లో 24, 3 ఫోర్లు)  వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చాడు.  29 ఓవర్లు ముగిసేసరికి  కివీస్.. 6 వికెట్ల నష్టానికి  131 పరుగులు చేసింది.  

బ్రేస్‌వెల్, సాంట్నర్ పోరాటం.. 

కీలక దశలో బ్యాటింగ్‌కు వచ్చిన  బ్రేస్‌వెల్.. కివీస్ ను ఆదుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆ జట్టుకు విజయంపై ఆశలు కల్పించాడు.  మిచెల్ సాంట్నర్  తో కలిసి  ఏడో వికెట్ కు 162 పరుగులు జోడించాడు.  వాషింగ్టన్ సుందర్ వేసిన  32వ ఓవర్లో  రెండు ఫోర్లు బాదిన అతడు.. హార్ధిక్ పాండ్యా వేసిన  35వ ఓవర్లో కూడా ఇదే సీన్ రిపీట్ చేశాడు. ఇక  ఠాకూర్ వేసిన 37వ ఓవర్లో అయితే అతడికి చుక్కలు చూపించాడు.   ఆ ఓవర్లో బ్రేస్‌వెల్.. 4,6 బాదడంతో 31 బంతుల్లోనే అతడి అర్థసెంచరీ పూర్తయింది. అదే ఓవర్లో మరో బౌండరీ బాదాడు. ఇక అర్థ సెంచరీ తర్వాత  అతడు మరింతగా రెచ్చిపోయాడు. ఠాకూర్ ను లక్ష్యంగా చేసుకున్న బ్రేస్‌వెల్.. అతడు వేసిన 39వ ఓవర్లో.. మూడు ఫోర్లు కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన తర్వాతి ఓవర్లో  రెండు భారీ సిక్సర్లు వచ్చాయి. షమీ వేసిన ఓవర్లో  సిక్స్ కొట్టి  90లలోకి వచ్చిన అతడు.. అతడే వేసిన 43వ ఓవర్లో  భారీ సిక్సర్ బాది  తన వన్డే కెరీర్ లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  57 బంతుల్లోనే అతడి సెంచరీ పూర్తయింది. 

బ్రేస్‌వెల్ సెంచరీ తర్వాత సాంట్నర్ కూడా ఓ చేయి వేశాడు.  సిరాజ్ బౌలింగ్ లో రెండు బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టాడు. చివరి 6 ఒవర్లలో 65 పరుగులు కావాల్సి ఉండగా  రోహిత్.. బంతిని హార్ధిక్  పాండ్యాకు ఇచ్చాడు. ఈ ఓవర్లో ఆరు పరుగులే వచ్చాయి. 

మళ్లీ మాయ చేసిన సిరాజ్.. 

ఈ మ్యాచ్ లో తన చివరి ఓవర్ వేసిన  సిరాజ్ కివీస్ ను చావుదెబ్బ తీశాడు.  అతడు వేసిన   46వ ఓవర్లో  నాలుగో బంతికి సాంట్నర్.. భారీ షాట్ ఆడబోయి సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 162 పరుగుల ఏడో వికెట్  భాగస్వామ్యానికి తెరపడింది.  అదే ఓవర్లో సిరాజ్.. ఐదో బంతికి  షిప్లేను క్లీన్ బౌల్డ్ చేశాడు.  

అయినా తగ్గని టెన్షన్..

తర్వాత ఓవర్ వేసిన పాండ్యా.. 15 పరుగులిచ్చాడు. దీంతో సమీకరణం  18 బంతుల్లో 41కు మారింది.  షమీ  48వ ఓవర్లో 17 పరుగులిచ్చాడు.  అయితే  49వ ఓవర్ వేసిన పాండ్యా.. మూడో బంతికి ఫెర్గూసన్ (8) ను పెవిలియన్ కు పంపాడు. చివరి  ఓవర్లో 20 పరుగులు అవసరమొచ్చాయి. రోహిత్.. శార్దూల్ ఠాకూర్ కు బంతినిచ్చాడు. 

చివరి ఓవర్లో ఇలా.. 

శార్దూల్ వేసిన ఆఖరు ఓవర్లో తొలి బంతిని బ్రేస్‌వెల్ లాంగాన్ మీదుగా భారీ సిక్సర్  బాదాడు. రెండో బంతికి వైడ్. మూడో బంతిని యార్కర్ గా వేశాడు శార్దూల్. అది కాస్తా  బ్రేస్‌వెల్ కాలికి తాకింది. భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేశారు. అంపైర్  ఔట్  ఇచ్చాడు.    కివీస్ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది.  అంతే.. 12 పరుగుల తేడాతో భారత్ ఉత్కంఠ విజయం అందుకుంది.   మ్యాచ్ ఓడినా   బ్రేస్‌వెల్ పోరాటం ఆకట్టుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios