INDvsNZ: 350 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రస్తుతం ఆ జట్టు ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. సిరాజ్, షమీ, శార్దూల్ తలా ఒక వికెట్ తీయగా.. కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు.
తొలి వన్డేలో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ తడబడుతున్నది. టీమిండియా బౌలర్ల ధాటికి ఇప్పటికే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. భారత్ కు సిరాజ్ తొలి బ్రేక్ ఇవ్వగా శార్దూల్ రెండో వికెట్ తీశాడు. ఇక కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో కివీస్ కు షాకులిస్తున్నాడు. వీరికి షమీ కూడా జతకలిశాడు. 350 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రస్తుతం ఆ జట్టు ఐదు కీలక వికెట్లు కోల్పోయి.. 25 ఓవర్లు ముగిసేసరికి 112 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (30 బంతుల్లో 17 నాటౌట్), మైకేల్ బ్రాస్‌వెల్ (1 నాటౌట్) ఆడుతున్నారు. ఈ ఇద్దరూ ఔటైతే కివీస్ కు కష్టాలు తప్పవు. ఆ జట్టు విజయానికి మరో 25 ఓవర్లలో 238 పరుగులు కావాల్సి ఉంది.
భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ కు సిరాజ్ తొలి షాక్ ఇచ్చాడు. రెండు ఫోర్లు కొట్టి జోరుమీదున్న డెవాన్ కాన్వే (10) ను షాట్ బంతికి భారీ షాట్ ఆడి ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కుల్దీప్ కు చిక్కాడు.
కాన్వే ఔటైనా మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (39 బంతుల్లో 40, 7 ఫోర్లు, 1 సిక్సర్) మాత్రం ధాటిగా ఆడాడు. తొలుత ఇన్నింగ్స్ ను నెమ్మదిగా మొదలుపెట్టినా హార్ధిక్ పాండ్యా వేసిన కివీస్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో 4,6,4,4 బాదాడు. ఆ ఓవర్లో 20 పరుగులు పిండుకున్నాడు. అయితే జోరుమీదున్న అలెన్ ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ కు పంపాడు. దీంతో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానికి 70 పరుగులుగా ఉంది.
ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కివీస్ కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. అతడు వేసిన 16వ ఓవర్ రెండో బంతికి నికోలస్ (18) బౌండరీ బాదాడు. కానీ మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తన తర్వాతి ఓవర్లో కుల్దీప్.. డారిల్ మిచెల్ (9) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఫలితంగా న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది.
వరుసగా వికెట్లు పడుతున్న నేపథ్యంలో కివీస్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. కెప్టెన్ టామ్ లాథమ్ తో పాటు ఫిలిప్స్ కూడా వికెట్ల పతనాన్ని అడ్డుకోవడానికి యత్నిస్తూ సింగిల్స్ మీద ఫోకస్ పెట్టారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు 41 బంతుల్లో 21 పరుగులు జోడించారు. అయితే షమీ ఈ జోడీని విడదీశాడు. అతడు వేసిన 25వ ఓవర్ మూడో బంతికి గ్లెన్ ఫిలిప్స్ (11) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
