Asianet News TeluguAsianet News Telugu

డబుల్ సెంచరీల చరిత్ర.. ఇప్పటిదాకా చేసినవే 10.. అందులో అగ్రభాగం టీమిండియావే...

Shubman Gill: 1970 ల నుంచే వన్డే క్రికెట్ ఆడుతున్నా  అంతర్జాతీయ  స్థాయిలో తొలి డబుల్ నమోదైంది మాత్రం  ఇండియాలోనే.  2010లో సచిన్ డబుల్ హండ్రెడ్ నుంచి నేటి గిల్ వరకూ డబుల్ వీరులు వీళ్లే.. 

INDvsNZ : From Sachin Tendulkar To Shubman Gill, Look at the Double Heroes in ODI Cricket History MSV
Author
First Published Jan 18, 2023, 6:13 PM IST

ఒకప్పుడు అంతర్జాతీయ  క్రికెట్ లో   మూడంకెల స్కోరు అంటే  వంద పరుగులే.  పరిమిత ఓవర్ల (50) క్రికెట్ లో సెంచరీ చేయాలంటేనే  బ్యాటర్లు నానా తిప్పలు పడేవాళ్లు.   ఓపెనర్ గా వచ్చిన  బ్యాటర్.. ముక్కీ మూలిగి  30, 35 వ ఓవర్ల తర్వాత గానీ  శతకం బాదకపోయేది.  ఈ క్రమంలో  డబుల్ సెంచరీల ఊసే రాలేదు. కొంతమంది  బ్యాటర్లు  దానికోసం యత్నించినా  వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.  

టెస్టులలో డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు బాదిన క్రికెటర్లు కూడా వన్డేలలో ద్విశతకాలు సాధించడంలో అంతగా సక్సెస్ కాలేదు.  కానీ   క్రికెట్ దేవుడు  సచిన్ టెండూల్కర్ పుణ్యమా అని  అంతర్జాతీయ క్రికెట్ లో తొలి ద్విశతకం నమోదైంది.  మాస్టర్ బ్లాస్టర్ మొదలెట్టిన ఈ యజ్ఞాన్ని రోహిత్ శర్మ పీక్స్ కు తీసుకెళ్లాడు. 

మాస్టర్ తో మొదలు.. 

1970 ల నుంచే వన్డే క్రికెట్ ఆడుతున్నా  అంతర్జాతీయ  స్థాయిలో తొలి డబుల్ నమోదైంది మాత్రం  ఇండియాలోనే.  2010లో సచిన్.. సౌతాఫ్రికాపై   తొలిసారిగా ఈ ఫీట్ ను అందుకున్నాడు.  ఆ తర్వాత 2011 లతో వీరేంద్ర సెహ్వాగ్..  వెస్టిండీస్ పై ద్విశతకం బాదాడు.  మరో రెండేండ్ల తర్వాత    రోహిత్ శర్మ దానిని పీక్స్ కు తీసుకెళ్లాడు.  2013లో  ఆస్ట్రేలియాపై , 2014, 2017లో శ్రీలంక పై రెండు డబుల్ సెంచరీలు చేశాడు.  

మధ్యలో వాళ్లు.. 

సచిన్, సెహ్వాగ్, రోహిత్.. ఈ ముగ్గురూ టీమిండియా   ఆటగాళ్లే. వీళ్లు కాకుండా  డబుల్ సెంచరీ చేసిన వారిలో ప్రథముడు క్రిస్ గేల్. గేల్ 2015లో జింబాబ్వేపై ద్విశతకం  సాధించాడు.  అతడి తర్వాత  అదే ఏడాదిలో  కివీస్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్.. విండీస్ పై డబుల్ బాదాడు.  2018లో పాకిస్తాన్ బ్యాటర్ ఫకర్ జమాన్ జింబాబ్వేపై  డబుల్ సెంచరీ  సాధించాడు. 

గడిచిన నెల రోజుల్లో.. 

పురుషుల అంతర్జాతీయ క్రికెట్  లో  ఫకర్ జమాన్ తర్వాత నాలుగేండ్లకు డబుల్ నమోదైంది.  ఇటీవలే బంగ్లాదేశ్ పర్యటనలో భారత  యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. డబుల్ సెంచరీ బాదాడు.  అంతర్జాతీయ క్రికెట్ లో డబుల్ సెంచరీ బాదిన తొలి  లెఫ్టార్మ్ బ్యాటర్ ఇషానే కావడం గమనార్హం. ఇక  తాజాగా శుభమన్ గిల్..  కివీస్ పై  వీరవిహారం చేసి  ద్విశతకం సాధించాడు. 

 

అంటే మొత్తంగా అంతర్జాతీయ (పురుషుల క్రికెట్ లో) స్థాయిలో  12 (ఇందులో  రెండు మహిళల క్రికెట్ లో నమోదయ్యాయి. పురుషుల వరకే తీసుకుంటే 10) డబుల్ సెంచరీలు నమోదుకాగా  అందులో  ఏడు భారత్ ఆటగాళ్లు చేసినవే కావడం గమనార్హం. దీనిని బట్టి ఇంటర్నేషనల్ క్రికెట్ లో భారత బ్యాటర్ల పరుగుల దాహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

భారత్ నుంచి డబుల్ వీరులు : 

- రోహిత్ శర్మ : 3 
- సచిన్ టెండూల్కర్ : 1 
- వీరేంద్ర సెహ్వాగ్ : 1 
- ఇషాన్ కిషన్ : 1 
- శుభమన్ గిల్ : 1  

- మిగిలిన ఐదులో ముగ్గురు (క్రిస్ గేల్, మార్టిన్ గప్తిల్, ఫకర్ జమాన్) పురుషులు కాగా మరో ఇద్దరు  అమెలియా కేర్ (న్యూజిలాండ్), బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా - మహిళల క్రికెట్ లో తొలి డబుల్ సెంచరీ ఈమెదే.. 1997లో) ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios