Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 3rd T20I: మూడో టీ20లో టీమిండియా ఘన విజయం... పొట్టి సిరీస్ క్లీన్‌స్వీప్...

India vs New Zealand: హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన మార్టిన్ గప్టిల్... మూడో టీ20లో అదరగొట్టిన భారత బౌలర్లు... టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా...

INDvsNZ 3rd T20I: Team India beats New Zealand, and Rohit Sharma clean sweep T20 series
Author
India, First Published Nov 21, 2021, 10:29 PM IST

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో న్యూజిలాండ్‌ చేతుల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. కెప్టెన్‌గా తొలి సిరీస్ ఆడుతున్న రోహిత్ శర్మ సారథ్యంలో కివీస్‌ను 3-0 తేడాతో చిత్తు చేసి, క్లీన్ స్వీప్ చేసింది. మొదటి రెండు మ్యాచుల్లో ఛేదన చేసి గెలిచిన జట్టు, మూడో టీ20లో మాత్రం తొలుత బ్యాటింగ్ చేసి 73 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది... 185 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ చేసిన కివీస్ 111 పరుగులకు ఆలౌట్ అ్యింది. 

185 పరుగుల లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌కి మూడో ఓవర్‌లో షాక్ తగిలింది. అక్షర్ పటేల్ ఒకే ఓవర్‌లో డార్ల్ మిచెల్, మార్క్ ఛాప్‌మన్‌లను అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో గ్లెన్ ఫిలిప్స్ కూడా అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ కావడంతో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది కివీస్...

ఓ వైపు వికెట్లు పడుతున్నా బౌండరీల మోత మోగించిన మార్టిన్ గప్టిల్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి చాహాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 17 పరుగులు చేసిన టిమ్ సిఫర్ట్ రనౌట్ కాగా, జేమ్స్ నీశమ్ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 

2 పరుగులు చేసిన మిచెల్ సాంట్నర్ రనౌట్ కాగా, ఆడమ్ మిల్నేని అవుట్ చేసిన వెంకటేశ్ అయ్యర్, తన కెరీర్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ వికెట్‌ని అందుకున్నాడు.  సోదీ 9 పరుగులు చేయగా, ఆఖర్లో లూకీ ఫర్గూసన్ రెండు సిక్సర్లతో 14 పరుగులు చేసి ఓటమి తేడాను తగ్గించగలిగాడు. 

అంతకుముందు టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో7  వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది... ఓపెనర్ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 

రోహిత్, ఇషాన్ కిషన్ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో పవర్ ప్లే ముగిసే సమయానికే 69 పరుగులు చేసింది భారత జట్టు. ఫర్గూసన్ వేసిన ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు రాబట్టారు రోహిత్, ఇషాన్ కిషన్...

ఏడో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన మిచెల్ సాంట్నర్, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి టీమిండియాకి షాక్ ఇచ్చాడు. 21 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, వికెట్ కీపర్ టిమ్ సిఫర్ట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్, నాలుగు బంతులు ఎదుర్కొన్నా పరుగులేమీ చేయకుండా, గప్టిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా 6 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లోనే జేమ్స్ నీశమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

6 ఓవర్లు ముగిసేసరికి 69/0 పరుగులతో భారీ స్కోరు చేసేలా కనిపించిన భారత జట్టు, వెంటవెంటనే వికెట్లు కోల్పోయి 83/3 స్కోరుకి చేరుకుంది. ఈ దశలో బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ...


31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చసిన రోహిత్ శర్మ, ఇష్ సోధీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ కలిసి ఐదో వికెట్‌కి 36 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఛాప్‌మన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, ఆ తర్వాత రెండో బంతికే శ్రేయాస్ అయ్యర్ పెవిలియన్ చేరాడు. 20 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్‌ను మిల్నే అవుట్ చేశాడు...


11 బంతుల్లో ఓ సిక్సర్, 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన హర్షల్ పటేల్, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 162 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది భారత జట్టు...

ఆఖరి ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన దీపక్ చాహార్, భారత జట్టు భారీ స్కోరులో తన వంతు పాత్ర పోషించాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios