INDvsNZ 3rd T20I: అహ్మదాబాద్ వేదికగా ముగిసిన మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా  టీమిండియా అదరగొట్టింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో  టీమిండియా  గెలవడంతో  మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్.. 2-1 తేడాతో గెలుచుకుంది. 

మోతేరా (నరేంద్ర మోడీ స్టేడియం పాత పేరు)లో టీమిండియా మోత మోగించింది. తొలి రెండు టీ20లలో కాస్త తడబడ్డ భారత్.. అహ్మదాబాద్ వేదికగా ముగిసిన మూడో మ్యాచ్ లో మాత్రం అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. అటు బ్యాటింగ్ లో శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి రచ్చ చేస్తే.. బౌలింగ్ లో హార్ధిక్ పాండ్యాతో పాటు ఉమ్రాన్, అర్ష్‌దీప్, శివమ్ మావిలు కివీస్ ను బెంబేలెత్తించారు. ఫలితంగా 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కివీస్.. 12.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్.. 168 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకుంది. ఈ విజయంతో భారత్.. సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. టీ20లలో భారత్ కు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం. 

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ కు ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఆ జట్టు ప్రమాదకర ఓపెనర్ ఫిన్ అలెన్ (3) ను తొలి ఓవర్లోనే హార్ధిక్ ఔట్ చేశాడు. షాట్ లెంగ్త్ బాల్ ను ఆడే క్రమంలో బంతి అతడి బ్యాట్ కు తాకి స్లిప్స్ దిశగా వెళ్లగా సూర్య బ్యాక్ కు అద్భుత డైవ్ తో క్యాచ్ అందుకున్నాడు.

రెండో ఓవర్ వేసిన కివీస్ కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. అతడు వేసిన రెండో ఓవర్లో తొలి బంతికే డెవాన్ కాన్వే (1) మిడాఫ్ వద్ద హార్ధిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆఖరి బంతికి మార్క్ చాప్‌మన్ (0) వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతికి చిక్కాడు. హార్ధిక్ పాండ్యా వేసిన నాలుగో మూడో ఓవర్లో నాలుగో బంతికి గ్లెన్ ఫిలిప్స్ (2) కూడా సూర్యకు క్యాచ్ ఇచ్చాడు. స్కోరు బోర్డుపై పది పరుగులు కూడా చేరకుండానే కివీస్ నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది.

ఓ సిక్సర్ కొట్టి జోరు మీద కనిపించిన బ్రాస్‌వెల్ (8) ను ఉమ్రాన్ మాలిక్ తన తొలి ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. 22 పరుగులకే కివీస్ బ్యాటర్లలో సగం మంది పెవలియన్ కు చేరారు. ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (13 బంతుల్లో 13, 1 ఫోర్) కూడా నిలువలేకపోయాడు. డారిల్ మిచెల్ తో కలిసి ఆరో వికెట్ కు 32 పరుగులు జోడించాడు. కివీస్ ఇన్నింగ్స్ లో ఇదే హయ్యస్ట్ పార్ట్‌నర్షిప్.

కానీ శాంట్నర్ ను శివమ్ మావి ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఔట్ చేశాడు. అతడు వేసిన షార్ట్ పిచ్ బంతిని శాంట్నర్ భారీ షాట్ ఆడాడు. కానీ మిడ్ వికెట్ వద్ద సూర్య సూపర్ క్యాచ్ అందుకోవడంతో కివీస్ సారథి వెనుదిరిగాడు. అదే ఓవర్లో ఐదో బంతికి ఇష్ సోధి (0) రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చాడు.

హార్ధిక్ పాండ్యా వేసిన పదో ఓవరన్ నాలుగో బంతికి ఫెర్గూసన్ (0) ఉమ్రాన్ మాలిక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పది ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోరు 56-8గా ఉంది. 12వ ఓవర్లో హార్ధిక్.. టిక్నర్ (1) ను ఐట్ చేశాడు. వరుసగా వికెట్లు పడుతున్నా న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ (25 బంతుల్లో 35, 1 ఫోర్, 3 సిక్సర్లు) పోరాడాడు. అయితే అతడికి సాయం అందించేవారెవరూ లేకపోవడంతో నిస్సహయకంగా మిగిలాడు. చివరికి అతడు.. ఉమ్రాన్ మాలిక్ వేసిన 13వ ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ ఆడబోయి శివమ్ మావికి క్యాచ్ ఇచ్చాడు. దీంతో కివీస్ ఇన్నింగ్స్ కు తెరపడింది. భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యాకు నాలుగు వికెట్లు దక్గకా ఉమ్రాన్, శివమ్ మావి, అర్ష్‌దీప్ లకు తలా రెండు వికెట్లు దక్కాయి. 

అంతకుముందు భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (126 నాటౌట్) , రాహుల్ త్రిపాఠి (44) మెరుపులు మెరిపించారు.