Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్... టిమ్ సౌథీకి ఐదు వికెట్లు...

India vs New Zealand: తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా... శ్రేయాస్ అయ్యర్ సెంచరీ.. శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలు...

INDvsNZ 1st Test: Team India all-out after Shryeas Iyer debut Century, Shubman Gill, Ravindra Jadeja
Author
India, First Published Nov 26, 2021, 12:25 PM IST

కాన్పూర్ టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111.1 ఓవర్లలో 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్‌ నైట్ స్కోరు 258/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, మరో 87 పరుగులు జోడించి ఆరు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఉదయం సెషన్‌లో రవీంద్ర జడేజా వికెట్ త్వరగా కోల్పోయింది టీమిండియా. 112 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, ఓవర్‌నైట్ స్కోరుకి పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు జడ్డూ...

Read Also: గంగూలీ కంటే దారుణంగా అజింకా రహానే ఫామ్... టీమిండియా టెస్టు టెంపరరీ కెప్టెన్‌పై...

మరో ఎండ్‌లో కేల్ జెమ్మీసన్‌ను టార్గెట్ చేస్తూ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన శ్రేయాస్ అయ్యర్, ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ అందుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్, రెండో రోజు ఉదయం సెషన్‌లో జెమ్మీసన్ బౌలింగ్‌లో మూడు ఓవర్లలో ఐదు ఫోర్లు బాదడం విశేషం...  157 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ మార్కు అందుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. 
 
ఈ శతాబ్దంలో తొలి టెస్టులో సెంచరీ చేసిన ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు శ్రేయాస్ అయ్యర్. 2001లో వీరేంద్ర సెహ్వాగ్, 2010లో సురేష్ రైనా, 2013లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, 2018లో పృథ్వీషా ఈ ఫీట్ సాధించారు. 

ఓవరాల్‌గా ఆరంగ్రేట టెస్టులో సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. 2016 తర్వాత స్వదేశంలో సెంచరీ చేసిన నెం.5 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు అయ్యర్. ఇంతకుముందు అజింకా రహానే రెండుసార్లు, కరణ్ నాయర్ (త్రిబుల్ సెంచరీ) మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

145 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో ఐదో వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా. రిషబ్ పంత్ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా 12 బంతుల్లో 1 పరుగులు చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ కాగా 171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్... డ్రింక్స్ బ్రేక్ తర్వాత మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన అయ్యర్, విల్ యంగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Also Read: ఆ కారణంగానే ఆ జట్టు నుంచి బయటికి శ్రేయాస్ అయ్యర్... ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్లు వీరే...

అక్షర్ పటేల్ 9 బంతుల్లో 3 పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో అవుట్ కాగా, రవిచంద్రన్ అశ్విన్ 56 బంతుల్లో 5 ఫోర్లతో 38 పరుగులు చేసి లంచ్ బ్రేక్ తర్వాత పెవిలియన్ చేరాడు. ఉమేశ్ యాదవ్ 34 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేయగా ఇషాంత్ శర్మను డకౌట్ చేసిన అజాజ్ పటేల్ ఆఖరి రెండు వికెట్లు తీశాడు.

న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీకి ఐదు వికెట్లు దక్కగా, కేల్ జెమ్మీసన్ మూడు వికెట్లు తీశాడు. 41 ఏళ్ల వయసులో భారత్‌లో టెస్టుల్లో ఐదు వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు టిమ్ సౌథీ... 

Follow Us:
Download App:
  • android
  • ios