Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 1st Test: అయ్యర్ అదరహో... ఆరంగ్రేట టెస్టులోనే అదిరిపోయే సెంచరీ...

ఆరంగ్రేటం టెస్టులో సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయాస్ అయ్యర్... హాఫ్ సెంచరీ చేసి అవుటైన రవీంద్ర జడేజా...

INDvsNZ 1st Test: Shreyas Iyer Completes Century in debut test match, Ravindra Jadeja
Author
India, First Published Nov 26, 2021, 10:09 AM IST

కాన్పూర్ టెస్టులో ఆరంగ్రేట బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టాడు. సీనియర్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయిన చోటు, మొట్టమొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసి ‘అదరహో’ అనిపించాడు. ఓవర్‌ నైట్ స్కోరు 258/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, రవీంద్ర జడేజా వికెట్ త్వరగా కోల్పోయింది.

112 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, ఓవర్‌నైట్ స్కోరుకి పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు జడ్డూ... మరో ఎండ్‌లో కేల్ జెమ్మీసన్‌ను టార్గెట్ చేస్తూ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన శ్రేయాస్ అయ్యర్, ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ అందుకున్నాడు.

Read Also: గంగూలీ కంటే దారుణంగా అజింకా రహానే ఫామ్... టీమిండియా టెస్టు టెంపరరీ కెప్టెన్‌పై...

శ్రేయాస్ అయ్యర్, రెండో రోజు ఉదయం సెషన్‌లో జెమ్మీసన్ బౌలింగ్‌లో మూడు ఓవర్లలో ఐదు ఫోర్లు బాదడం విశేషం...  157 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ మార్కు అందుకున్నాడు శ్రేయాస్ అయ్యర్...

ఈ శతాబ్దంలో తొలి టెస్టులో సెంచరీ చేసిన ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు శ్రేయాస్ అయ్యర్. 2001లో వీరేంద్ర సెహ్వాగ్, 2010లో సురేష్ రైనా, 2013లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, 2018లో పృథ్వీషా ఈ ఫీట్ సాధించారు. 

ఓవరాల్‌గా ఆరంగ్రేట టెస్టులో సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. 2016 తర్వాత స్వదేశంలో సెంచరీ చేసిన నెం.5 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు అయ్యర్. ఇంతకుముందు అజింకా రహానే రెండుసార్లు, కరణ్ నాయర్ (త్రిబుల్ సెంచరీ) మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

కాన్పూర్ వేదికగా  న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా... తొలి రోజు పూర్తి ఆధిక్యం కనబర్చింది. లంచ్ బ్రేక్ తర్వాత రెండో సెషన్‌లో వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన భారత జట్టును శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా కలిసి ఆదుకున్నారు.

Also Read: ఆ కారణంగానే ఆ జట్టు నుంచి బయటికి శ్రేయాస్ అయ్యర్... ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్లు వీరే...

 మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ తొలి వికెట్‌కి 21 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో ఓవర్‌ మూడో బంతికే శుబ్‌మన్ గిల్‌ను ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు అంపైర్. అప్పటికి భారత జట్టు స్కోరు 3 పరుగులు మాత్రమే. అయితే డీఆర్‌ఎస్ తీసుకున్న శుబ్‌మన్ గిల్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. రిప్లైలో గిల్ బ్యాట్‌కి బంతి ఎడ్జ్ తీసుకున్నట్టు స్పష్టంగా కనిపించింది. 

28 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, కేల్ జెమ్మీసన్ బౌలింగ్‌లో బ్లండెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గత 12 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్, 11 ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరాడు... ఇందులో ఆరు ఇన్నింగ్స్‌ల్లో డబుల్ డిజిట్ స్కోరు కూడా చేరుకోలేకపోయాడు మయాంక్ అగర్వాల్...

81 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్, అతిపిన్న వయసులో కివీస్‌పై హాఫ్ సెంచరీ చేసిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 91 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించగా, పృథ్వీ షా, కాంట్రాక్టర్, అథుల్ వాసన్ టాప్ 4లో ఉన్నారు. 22 ఏళ్ల 78 రోజుల వయసున్న శుబ్‌మన్ గిల్ టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు...

ఆస్ట్రేలియాపై, ఇంగ్లాండ్‌పై హాఫ్ సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్, ఇప్పుడు న్యూజిలాండ్‌పై కూడా ఈ ఫీట్ రిపీట్ చేశాడు. 23 ఏళ్ల లోపే 4 హాఫ్ సెంచరీలు చేసిన శుబ్‌మన్ గిల్, సునీల్ గవాస్కర్ (9). దినేశ్ కార్తీక్ (6), ఎంఎల్ జయసింహా (5) తర్వాతి స్థానంలో నిలిచాడు. 

21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన దశలో శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా కలిసి రెండో వికెట్‌కి 61 పరుగులు జోడించారు. తొలి సెషన్ ముగిసే సమయానికి 29 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయిన భారత జట్టు  82 పరుగులు చేసింది. 

అయితే లంచ్ బ్రేక్ తర్వాత వేసిన మొదటి ఓవర్‌లోనే శుబ్‌మన్ గిల్‌ను అవుట్ చేశాడు కేల్ జెమ్మీసన్. 93 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, జెమ్మీసన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు...

88 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, టిమ్ సౌథీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ టామ్ బ్లండెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. స్వదేశంలో మంచి రికార్డున్న పూజారా, 18 ఇన్నింగ్స్‌లు భారత్‌లో కూడా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు...

63 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేసిన కెప్టెన్ అజింకా రహానే, కేల్ జెమ్మీసన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు బంతికి అంపైర్ అవుట్ ఇచ్చినా, రివ్యూకి వెళ్లిన అజింకా రహానే నాటౌట్‌గా నిలిచినా, ఆ తర్వాతి బంతికే జెమ్మీసన్ షాక్ ఇచ్చాడు. 145 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా..

విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ వంటి స్టార్లు లేకపోవడంతో ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే వంటి సీనియర్లు ఆకట్టుకుంటారని ఫ్యాన్స్ ఆశించినా, వారి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రాలేదు...

 

Follow Us:
Download App:
  • android
  • ios