Asianet News TeluguAsianet News Telugu

INDvsBAN 2nd Test: మరోసారి ఫ్లాప్ అయిన విరాట్ కోహ్లీ... నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా...

IND vs BAN 2nd Test Day 2: చెరో 24 పరుగులు చేసి అవుటైన ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ... 100 పరుగుల లోపే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

 

INDvsBAN 2nd Test: Virat Kohli, Cheteshwar Pujara goes, Team India lost 4 early wickets
Author
First Published Dec 23, 2022, 12:05 PM IST

మూడేళ్ల బ్రేక్ తర్వాత వన్డేల్లో సెంచరీ చేసి కమ్‌బ్యాక్ ఇచ్చిన విరాట్ కోహ్లీ, టెస్టుల్లో మాత్రం పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 20 పరుగులే చేసిన విరాట్ కోహ్లీ, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు...


బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు 19/0 ఓవర్‌నైట్ స్కోరుతో  రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా... 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ 10 పరుగులు చేసి అవుట్ కాగా, తొలి టెస్టు సెంచరీ హీరోలు శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా కూడా స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు.

ఓపెనర్లు ఇద్దరినీ త్వరగా కోల్పోయింది. 45 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా..

ఆ తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ని కూడా పెవిలియన్ చేర్చాడు తైజుల్ ఇస్లాం. 39 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...

55 బంతుల్లో 2 ఫోర్లతో 24 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో మోమినుల్ పట్టిన అద్భుత క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. టెస్టుల్లో 7 వేల పరుగులు అందుకున్న ఈ ఫీట్ సాధించిన 8వ భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

డాన్ బ్రాడ్‌మన్ 6997 పరుగులను అధిగమించిన ఛతేశ్వర్ పూజారా.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ తర్వాత టెస్టుల్లో 7 వేలకు పైగా పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా నిలిచాడు.

రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది భారత జట్టు. లంచ్ బ్రేక్ తర్వాత కొద్ది సేపటికే విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది టీమిండియా. 73 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో నురుల్ హసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
 
40 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసిన టీమిండియా, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 126 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో ఉన్న రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ రాణించడంపైనే టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు ఆధారపడి ఉంది... 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌, తొలి ఇన్నింగ్స్‌లో 73.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 227 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో నాలుగు వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు.. 157 బంతులు ఆడి 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 84 పరుగులు చేసిన మోమినుల్ హక్, బంగ్లా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Follow Us:
Download App:
  • android
  • ios