Asianet News TeluguAsianet News Telugu

INDvsBAN 2nd Test: తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా ఆలౌట్... మోమినుల్ సెంచరీ మిస్...

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌట్ అయిన బంగ్లాదేశ్.. ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌లకు నాలుగేసి వికెట్లు.. 

INDvsBAN 2nd Test: Mominul Haque missed Century, Umesh Yadav, Ravichandran Ashwin
Author
First Published Dec 22, 2022, 3:33 PM IST

టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌, తొలి ఇన్నింగ్స్‌లో 73.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 227 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో నాలుగు వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు..  మోమినుల్ హక్ 84 పరుగులు చేసి బంగ్లాదేశ్ తరుపున హై స్కోరర్‌గా నిలిచాడు. 

రెండో ఓవర్ తొలి బంతికి జాకీర్ హసన్ ఇచ్చిన క్యాచ్‌ని మహ్మద్ సిరాజ్ జారవిడిచాడు. సున్నా వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జాకీర్ హసన్,, జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

2010లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్,  4380 రోజుల తర్వాత తొలి టెస్టు వికెట్ పడగొట్టాడు. జాకీర్ హసన్ అవుటైన తర్వాత మూడో బంతికే నజ్ముల్ హుస్సేన్ షాంటో కూడా పెవిలియన్ చేరాడు. 57 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటో, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

షాంటో డీఆర్‌ఎస్ తీసుకున్నా, టీవీ రిప్లైలో అంపైర్ కాల్స్‌గా తేలడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు బంగ్లా ఓపెనర్. వస్తూనే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్...

39 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పూజారాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 46 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన ముస్తాఫికర్ రహీం, నాలుగో వికెట్‌కి మోమినుల్ హక్‌తో కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు...

జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ముస్తాఫికర్ రహీం. లిటన్ దాస్, మోమినుల్ హక్ కలిసి ఐదో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జత చేశారు...

26 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన లిటన్ దాస్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... మెహిదీ హసన్ మిరాజ్ 15 పరుగులు చేసి అవుట్ కాగా నురుల్ హసన్ 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వెంటవెంట ఓవర్లలో ఈ రెండు వికెట్లు కూడా ఉమేశ్ యాదవ్‌కే పడ్డాయి...

ఓ ఎండ్‌లో వికెట్ పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకుపోయిన మోమినుల్ హక్, భారత ఫాస్ట్ బౌలర్లను టార్గెట్ చేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు... జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాది 78 బంతుల్లో 10 బౌండరీలతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు మోమినుల్ హక్. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో మోమినుల్ హక్, సింగిల్ డిజిట్ స్కోరు దాటడం ఇదే మొదటిసారి..  

157 బంతులు ఆడి 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 84 పరుగులు చేసిన మోమినుల్ హక్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికే ఖలీద్ అహ్మద్‌ని అవుట్ చేసిన అశ్విన్, బంగ్లా ఇన్నింగ్స్‌కి తెర దించాడు. 12 ఏళ్ల తర్వాత రెండో టెస్టు ఆడుతున్న జయ్‌దేవ్ ఉనద్కట్‌కి రెండు వికెట్లు దక్కాయి... 

213  పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్, మిగిలిన ఐదు వికెట్లను 14 పరుగుల తేడాలో కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 3 మెయిడిన్ ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్, టెస్టుల్లో 800 మెయిడిన్ ఓవర్లు వేసిన ఐదో భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు అనిల్ కుంబ్లే, బిషన్ సింగ్ భేడీ, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ మాత్రమే టెస్టుల్లో 800+ మెయిడిన్ ఓవర్లు వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios