INDvsBAN 2nd Test: మరోసారి టాస్ ఓడిపోయిన టీమిండియా... కుల్దీప్ యాదవ్‌ను పక్కనబెట్టి...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్... కుల్దీప్ యాదవ్ స్థానంలో జయ్‌దేవ్ ఉనద్కట్‌కి అవకాశం...

బంగ్లాదేశ్ టూర్‌లో టీమిండియా మరో సారి టాస్ ఓడిపోయింది. వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా టాస్ గెలవలేకపోయిన భారత జట్టు, తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ఢాకాలో జరుగుతున్న రెండో టెస్టులో మరోసారి టాస్ ఓడిపోయింది టీమిండియా. రెండో టెస్టులో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు...
బ్యాటింగ్ ప్రారంభించిన రెండో ఓవర్ మొదటి బంతికి బంగ్లా ఓపెనర్ జాకీర్ హుస్సేన్ ఇచ్చిన క్యాచ్‌ని మహ్మద్ సిరాజ్ డ్రాప్ చేశాడు. దీంతో ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్ తీసే అద్భుత అవకాశాన్ని చేజార్చుకుంది భారత జట్టు. 5 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది బంగ్లాదేశ్...
వీసా రావడం ఆలస్యం కావడంతో తొలి టెస్టు ఆడే అవకాశాన్ని కోల్పోయిన జయ్‌దేవ్ ఉనద్కట్, రెండో టెస్టులో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. తొలి టెస్టులో 8 వికెట్లు తీసి, బ్యాటింగ్‌లోనూ 40 పరుగులు చేసి మెప్పించి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన కుల్దీప్ యాదవ్ స్థానంలో జయ్‌దేవ్ ఉనద్కట్‌కి అవకాశం దక్కడం విశేషం..
2010, డిసెంబర్ 16న అంతర్జాతీయ టెస్టు ఆరంగ్రేటం చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్, 12 ఏళ్ల 6 రోజుల తర్వాత రెండో టెస్టు ఆడబోతున్నాడు. 2010లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు జయ్‌దేవ్ ఉనద్కట్. ఆ మ్యాచ్‌లో 26 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు జయ్‌దేవ్. ఆ తర్వాత మళ్లీ ఈ సౌరాష్ట్ర కుర్రాడికి అవకాశం దక్కలేదు...
శార్దూల్ ఠాకూర్ తొలి టెస్టులో ఒక్క ఓవర్ కూడా వేయకుండానే గాయపడి మ్యాచ్‌కి దూరమయ్యాడు. తిరిగి గబ్బా టెస్టులో రీఎంట్రీ ఇచ్చి టీమిండియాకి అద్భుత విజయం అందించాడు. జయ్‌దేవ్ ఉనద్కట్ నుంచి కూడి ఇలాంటి పర్ఫామెన్స్ ఆశిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్..
తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా, బౌలింగ్‌లో ఒకే ఒక్క వికెట్ పడగొట్టగలిగాడు. కుల్దీప్ యాదవ్ రెండు విభాగాల్లోనూ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయినా రవిచంద్రన్ అశ్విన్‌కి మరో ఛాన్స్ ఇచ్చి, కుల్దీప్ యాదవ్‌ని మరోసారి పక్కనబెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
బుధవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడిన కెఎల్ రాహుల్, రెండో టెస్టుకి అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయాలు అనుమానాలు రేగినా... అతను కోలుకుని, నేటి మ్యాచ్ ఆడుతున్నాడు.
రెండో టెస్టుకి భారత జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, రిషబ్ ంపత్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జయ్‌దేవ్ ఉనద్కట్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్
బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హుస్సేన్ షాంటో, జాకీర్ హసన్, మోమునుల్ హక్, లిటన్ దాస్, ముస్తాఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), నురుల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, టస్కిన్ అహ్మద్