INDvsAUS: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి తీసిన వికెట్లతో   అశ్విన్.. కపిల్‌దేవ్ ను అధిగమించాడు. 

భారత క్రికెట్ జట్టు రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో నాథన్ లియన్ వికెట్ తీయగానే అశ్విన్.. అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక వికెట్లు తీసుకున్న మూడో భారత బౌలర్ గా నిలిచాడు. 

టెస్టులు, వన్డేలు, టీ20లలో కలిపి ఇప్పటివరకు అశ్విన్ 688 వికెట్లు తీశాడు. తద్వారా కపిల్ దేవ్ రికార్డు (687) ను అధిగమించాడు. కపిల్ దేవ్.. టెస్టులలో 434 వికెట్లు తీయగా వన్డేలలో 253 వికెట్లు పడగొట్టాడు. 

రవిచంద్రన్ అశ్విన్.. టెస్టులలో 463, వన్డేలలో 151, టీ201లలో 72 వికెట్లు పడగొట్టి కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు. తద్వారా భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన మూడో బౌలర్ గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు : 

- అనిల్ కుంబ్లే (953)
- హర్భజన్ సింగ్ (707)
- ఆర్. అశ్విన్ (688) 
- కపిల్ దేవ్ (687) 
- జహీర్ ఖాన్ (597) 

Scroll to load tweet…

కాగా ఇండోర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు బౌలింగ్, బ్యాటింగ్ లో ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఉదయం సెషన్ లోనే తోకముడించింది. ఆ జట్టు చివరి ఆరు వికెట్లు 11 పరుగుల తేడాతో నేలకూలడం గమనార్హం. తొలుత హ్యాండ్స్‌కాంబ్ (19) ను అశ్విన్ ఔట్ చేయగా తర్వాత గ్రీన్ (21) ను ఉమేశ్ యాదవ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. ఉమేశ్ యాదవ్.. తర్వాత స్టార్క్ (1), మర్ఫీ (0) లను బౌల్డ్ చేశాడు. నాథన్ లియన్ (5) ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కీలకమైన 88 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది.

Scroll to load tweet…