India vs Australia: నాథన్ లియాన్‌కి 8 వికెట్లు... రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా... ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల లక్ష్యం... 

ఇండోర్ టెస్టులో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకి ఆలౌట్ అయిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేసిన ఆస్ట్రేలియాకి 76 పరుగుల స్వల్ప టార్గెట్ ఇచ్చింది... టాపార్డర్‌, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయినా లోయర్ ఆర్డర్‌ బ్యాటర్లతో కలిసి ఛతేశ్వర్ పూజారా చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా. 

5 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ని, నాథన్ లియాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. 33 బంతుల్లో 12 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నాథన్ లియాన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...

26 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మ్యాట్ కుహ్నేమన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత జట్టు.. ఈ దశలో రవీంద్ర జడేజా, ఛతేశ్వర్ పూజారా కలిసి నాలుగో వికెట్‌కి 24 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

36 బంతుల్లో 7 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్, ఛతేశ్వర్ పూజారా కలిసి ఐదో వికెట్‌కి 35 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

శ్రీకర్ భరత్ 3 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 28 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన అశ్విన్, నాథన్ లియాన్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన ఛతేశ్వర్ పూజారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

142 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ పట్టిన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో పూజారా అవుట్ కావడం ఇది 13వ సారి. 

రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన నాథన్ లియాన్, టెస్టుల్లో 23వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 113 వికెట్లు తీసి, అనిల్ కుంబ్లే (111 వికెట్లు) రికార్డు అధిగమించాడు నాథన్ లియాన్. అశ్విన్ 106 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 

తొలి బంతికి అంపైర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ ఇచ్చినా డీఆర్‌ఎస్ తీసుకుని లైఫ్ దక్కించుకున్న ఉమేశ్ యాదవ్, దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు. ఆ తర్వాతి బంతికి భారీ షాట్‌కి యత్నించి బౌండరీ లైన్ దగ్గర కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఉమేశ్ యాదవ్. అక్షర్ పటేల్ 39 బంతుల్లో ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేయగా మహ్మద్ సిరాజ్, నాథన్ లియాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 163 పరుగుల వద్ద తెరపడింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 197 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్ స్కోరు 156/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఒకానొక దశలో 186/4 స్కోరుతో భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నట్టు కనిపించింది. అయితే 11 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఆసీస్. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ కావడంతో 88 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది ఆస్ట్రేలియా. ఈ ఆధిక్యమే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయనుంది.