INDvsAUS 3rd Test: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులలో వైఫల్యం విజయవంతంగా కొనసాగుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన కోహ్లీ హాఫ్ సెంచరీ కూడా అందుకోలేకపోయాడు.
రన్ మిషీన్ విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్ ముగింపునకు చేరుకుందా..? సుదీర్ఘ ఫార్మాట్ లో ఇక కోహ్లీ బ్యాట్ నుంచి పరుగుల వరదను అభిమానులు చూడలేరా...? ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో వీరబాదుడు బాదిన కోహ్లీ.. ఇక పరిమిత ఓవర్ల బ్యాటర్ గానే మిగిలిపోనున్నాడా..? ఒకవైపు తన సహచర ఆటగాళ్లు (రూట్, విలియమ్సన్) సెంచరీలు బాదుతుంటే కోహ్లీ ఇంకా హాఫ్ సెంచరీ చేయడానికి.. కాదు, కాదు.. క్రీజులో నిలవడానికే నానా తంటాలు పడుతున్నాడు. తాజాగా ఇండోర్ టెస్టులో కూడా కోహ్లీ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు.
ఇండోర్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 22 పరుగులు చేసిన కోహ్లీ.. కీలకమైన రెండో ఇన్నింగ్స్ లో 13 పరుగులే చేసి వెనుదిరిగాడు. మూడేండ్ల పేలవ ఫామ్ తర్వాత గతేడాది ఆగస్టు తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఫామ్ అందుకున్న కోహ్లీ.. టెస్టులలో మాత్రం ఇంకా అదే పేలవ ప్రదర్శనను కొనసా.....గిస్తున్నాడు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఆస్ట్రేలియాపై ఆడటంలో మంచి రికార్డు ఉన్న కోహ్లీ.. ఈ సిరీస్ లో తొలి టెస్టులో 12 పరుగులే చేసి ఔటయ్యాడు. ఢిల్లీ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 44 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 20 రన్స్ కే పెవిలియన్ కు చేరాడు. ఇండోర్ (22, 13) లోనూ అదే వైఫల్యం.
టెస్టులలో కోహ్లీ సెంచరీ చేసి మూడేండ్లు దాటిపోయింది. అర్థ సెంచరీ చేసి కూడా ఏడాది దాటింది. గతేడాది భారత జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లగా అక్కడ మూడో టెస్టులో కోహ్లీ హాఫ్ సెంచరీ (79) రన్స్ చేశాడు. ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంక (45, 23, 13) ఇంగ్లాండ్ పై బర్మింగ్‌హామ్ టెస్టు (20, 11), బంగ్లాదేశ్ సిరీస్ (1, 19, 24, 1) లలో వైఫల్యాలు కొనసాగుతున్నాయి. హాఫ్ సెంచరీల సంగతేమో గానీ కనీసం క్రీజులో నిలవడానికే కోహ్లీ నానా తంటాలు పడుతున్నాడు.
ఇండోర్ టెస్టులో కోహ్లీ వైఫల్యం కొనసాగాక టీమిండియా ఫ్యాన్స్ అతడి ఆటపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీ ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ గొప్ప బ్యాటర్ అయినంత మాత్రానా జట్టుకు భారంగా ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారు..? అని ప్రశ్నిస్తున్నారు. టెస్టు క్రికెట్ లో మునపటి ఫామ్ ను అందుకోవడానికి కోహ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడితే మంచిదని సూచిస్తున్నారు. అలా అయితే అయినా కోహ్లీ తన తప్పులను తెలుసుకుని మునపటి ఆట ఆడగలడని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. ‘అసలు చాలాకాలంగా భరిస్తున్నాం గానీ కోహ్లీ టెస్టు ప్లేయరే కాదు. ఇక పరిమిత ఓవర్లకే పరిమితమైతే మంచిది..’ అని అభిప్రాయపడుతుండగా మరికొందరు అతడి మంచి కోరి.. ‘ఇక టెస్టు ఫార్మాట్ కు కోహ్లీ గుడ్ బై చెబితే మంచిది..’ అని కామెంట్స్ చేస్తున్నారు. 8 టెస్టులుగా హాఫ్ సెంచరీ చేయడానికి తంటాలు పడుతున్న బ్యాటర్ ను ఇంకెంతకాలం భరించాలి..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
