తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... భారత్‌పై 47 పరుగుల ఆధిక్యంలో ఆసీస్! కీలకంగా మారిన రెండో రోజు ఆట.. 

టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం సాగింది. టీమిండియా తొలి ఒకటిన్నర సెషన్లలోనే ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత రెండు సెషన్లలో బ్యాటుతో డామినేషన్ చూపించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 54 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 47 పరుగుల ఆధిక్యం సంపాదించింది...

కామెరూన్ గ్రీన్ 6, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. మిగిలిన 6 వికెట్లను టీమిండియా బౌలర్లు ఎంత త్వరగా తీస్తారు, రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఎంత స్కోరు చేస్తుందనే విషయాలే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించబోతున్నాయి.

భారత జట్టును 33.2 ఓవర్లలోనే ఆలౌట్ చేసిన ఆసీస్‌కి శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ట్రావిస్ హెడ్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు రవీంద్ర జడేజా. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న టీమిండియాకి ఫలితం దక్కింది...

ఆ తర్వాతి ఓవర్‌లో మార్నస్ లబుషేన్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు రవీంద్ర జడేజా. అయితే అది నో బాల్‌గా తేలడంతో లబుషేన్ నాటౌట్‌గా తేలాడు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా కోసం రెండు సార్లు రివ్యూ తీసుకుని, ఫలితం రాబట్టలేకపోయింది టీమిండియా. రెండు డీఆర్‌ఎస్ రివ్యూలు వృథా కావడంతో ఆ తర్వాత జాగ్రత్త పడింది టీమిండియా...

ఇది ఆస్ట్రేలియాకి కలిసి వచ్చింది. లబుషేన్ 7 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేసింది టీమిండియా. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఒకే రివ్యూ మిగలడంతో డీఆర్‌ఎస్ తీసుకోలేదు రోహిత్. అయితే టీవీ రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించింది..

102 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఉస్మాన్ ఖవాజాతో కలిసి రెండో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు మార్నస్ లబుషేన్. అదృష్టం కలిసి రావడంతో మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్నస్ లబుషేన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

91 బంతులు ఆడిన మార్నస్ లబుషేన్ ఓ ఫోర్‌తో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. నాలుగో ఓవర్‌లో అవుట్ కావాల్సిన లబుషేన్, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి 1 పరుగు దూరంలో నిలిచిన తర్వాత 34వ ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. 

 147 బంతుల్లో 4 ఫోర్లతో 60 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 38 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ కూడా జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

ఆస్ట్రేలియా కోల్పోయిన 4 వికెట్లు కూడా రవీంద్ర జడేజానే పడగొట్టాడు. అయితే ట్రావిస్ హెడ్‌ని అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకుని వికెట్ సాధించిన రవీంద్ర జడేజా, ఆ తర్వాత లబుషేన్ కోసం రెండు సార్లు, స్మిత్ కోసం ఓసారి డీఆర్‌ఎస్ రివ్యూలు తీసుకుని వాటిని వృథా చేశాడు. తొలి 40 ఓవర్లలో 3 డీఆర్‌ఎస్ రివ్యూలను కోల్పోయింది టీమిండియా..