Indore Test: మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం.. మూడో రోజు 18.5 ఓవర్లలోనే ముగిసిన ఆట... రోహిత్ శర్మకు తొలి టెస్టు పరాజయం..
తొలి రెండు టెస్టుల్లో ఘన విజయాలు అందుకున్న భారత జట్టుకి మూడో టెస్టులో షాక్ తగిలింది. ఇండోర్ టెస్టులో గెలిచి అటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్‌లో ప్లేస్ ఫిక్స్ చేసుకోవడంతో పాటు, ఇటు ఐసీసీ నెం.1 టెస్టు టీమ్ ప్లేస్‌ని దక్కించుకోవాలని చూసిన భారత జట్టు ఆశలు నెరవేరలేదు. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛేదించి, సిరీస్‌లో టీమిండియా ఆధిక్యాన్ని 2-1 తేడాకి తగ్గించింది ఆస్ట్రేలియా...
మూడో రోజు తొలి సెషన్‌లో 18.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కోల్పోయి, విజయాన్ని అందుకుంది. ఉస్మాన్ ఖవాజా డకౌట్ అయినా మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ కలిసి రెండో వికెట్‌కి అజేయంగా 78 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ట్రావిస్ హెడ్ 53 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 49 పరుగులు చేయగా మార్నస్ లబుషేన్ 58 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు.
ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో మొదటి రెండు టెస్టుల్లో ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయిన ఆస్ట్రేలియా, స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో 2023 పర్యటనలో తొలి విజయం అందుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియాకి ఇదే తొలి టెస్టు పరాజయం. 76 పరుగుల టార్గెట్‌తో మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, ఉస్మాన్ ఖవాజా వికెట్‌కి మొదటి ఓవర్‌లోనే కోల్పోయింది...
2 బంతులు ఎదుర్కొన్న ఖవాజా, అశ్విన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తొలి 10 ఓవర్లలో 13 పరుగులే చేసింది ఆస్ట్రేలియా. అయితే ఆ తర్వాత బాల్ ఛేంజ్ చేసి కొత్త బంతి తీసుకోవడంతో సీన్ మారింది. మార్నస్ లబుషేన్, ట్రావిడ్ హెడ్ బౌండరీలతో భారత స్పిన్నర్లను ఓ ఆటాడుకున్నారు.
కొత్త బంతితో స్పిన్నర్లు తేలిపోవడంతో ఆ తర్వాత 5 ఓవర్లలో 43 పరుగులు వచ్చేశాయి. తప్పు తెలుసుకున్న రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌కి బాల్ అందించినా అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. తొలి రెండు టెస్టులు రెండున్నర రోజుల పాటు సాగగా మూడో టెస్టు రెండో రోజు తొలి సెషన్‌లోనే ముగియడం విశేషం..
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకి ఆలౌట్ అయిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేసిన ఆస్ట్రేలియాకి దక్కిన 88 పరుగుల ఆధిక్యం భారత జట్టు ఓటమికి కారణమైంది..
తొలి ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలవగా రెండో ఇన్నింగ్స్‌లో ఛతేశ్వర్ పూజారా 142 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసి హాఫ్ సెంచరీ అందుకున్నారు. శ్రేయాస్ అయ్యర్ 26, రవిచంద్రన్ అశ్విన్ 16, అక్షర్ పటేల్ 15 పరుగులు చేశారు.
