ముంబై:  రెండు దశాబ్దాల అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానాన్ని ముగించాడు భారత ఆటగాడు వసీం జాఫర్. టెస్ట్ క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని భారత జట్టుకు సేవలందించిన అతడు గతకొన్నేళ్లుగా జట్టులో చోటు దక్కించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో చివరకు క్రికెట్ కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్న అతడు శనివారం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. 

క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు జాఫర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. రిటైర్మెంట్ కు సంబంధించిన లేఖను పోస్ట్ చేస్తూ భావోద్వేగపూరిత కామెంట్స్ చేశాడు. '' 25 ఏళ్ల ప్రొపెషనల్ కెరీర్ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చింది.  బిసిసిఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్, విసిఎ, నా సహచరులు, మీడియా, ఫ్యాన్స్ కు థ్యాంక్యూ. ఇది నా అధికారిక ప్రకటన'' అంటూ ట్వీట్ చేశాడు. 

2006లో సౌతాఫ్రికాతో సిరీస్‌ ద్వారా జాఫర్  టెస్ట్ క్రికెటర్ గా భారత జట్టులో అరంగేట్రం చేశాడు. అప్పటినుండి సుదీర్ఘకాలం క్రికెటర్ గా కొనసాగిన 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఐదు శతకాలు, 11 అర్ధశతకాలు బాదాడు. టెస్ట్ క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి వన్డే, టీ20 ఫార్మాట్లను మాత్రం ఆడలేకపోయాడు. 

ప్రస్తుతం జాఫర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో  కింగ్స్‌ లెవెన్ పంజాబ్‌ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. రంజీతో సహా అన్ని ఫార్మాట్ల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు జాఫర్ తన ట్విటర్‌ ద్వారా బీసీసీఐకు అధికారిక లెటర్‌ను పంపించాడు. ఈ సందర్భంగా బీసీసీఐ కూడా వసీం జాఫర్‌ ఫోటోను షేర్‌ చేస్తూ... 'థ్యాంక్యూ వసీం జాఫర్‌.. రంజీ లెజెండ్‌కు ఇవే మా శుభాకాంక్షలు' అని ట్వీట్‌ చేసింది.