ప్రవీణ్ తాంబే బయోపిక్ ‘కౌన్ ప్రవీణ్ తాంబే’ ట్రైలర్ రిలీజ్... 41 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ ఎంట్రీ ఇచ్చిన...

41 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రవీణ్ తాంబే... తాంబే జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో బయోపిక్ మూవీ... ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్‌పాడే...

Indian Cricketer Pravin Tambe Biopic Kaun Pravin Tambe trailer Released, Shreyas Talpade

క్రికెట్‌లో ఎనర్జీ, ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. అందుకే 35-36 ఏళ్లు రాగానే క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేస్తారు క్రికెటర్లు. అయితే 41 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన క్రికెటర్ ప్రవీణ్ తాంబే... ఆటపై ఉన్న ప్రేమను చూపించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించిన ప్రవీణ్ తాంబే జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ మూవీ ‘కౌన్ ప్రవీణ్ తాంబే’. బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్‌పాడే ఈ మూవీలో ప్రవీణ్ తాంబే పాత్రలో కనిపించబోతున్నాడు...

2022 ఏప్పిల్ 1న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో నేరుగా విడుదల కాబోతున్న ‘కౌన్ ప్రవీణ్ తాంబే’ చిత్ర ట్రైలర్ విడుదలైంది. భారత ప్రస్తుత హెడ్ కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ప్రసంగంతో ఈ చిత్ర టైలర్ మొదలవుతుంది...

 ప్రవీణ్ తాంబే క్రికెట్ ప్రస్తానంలో ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతోంది. ప్రవీణ్ తాంబే చిన్న తనంలో ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాడు. అయితే తన టీమ్ కెప్టెన్ అజయ్, లెగ్ స్పిన్ బౌలింగ్ వేయమని కోరడంతో అప్పటి నుంచి స్పిన్నర్‌గా మారిపోయాడు...

భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్‌ను తన స్పిన్ బౌలింగ్‌తో ఇంప్రెస్ చేసిన ప్రవీణ్ తాంబే, ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడడానికి ముందే ఐపీఎల్‌కి ఎంపికయ్యాడు. కంగా మెమొరియల్ క్రికెట్ లీగ్‌లో ప్రవీణ్ తాంబే బౌలింగ్‌ను చూసిన అప్పటి రాజస్థాన్ రాయల్స్ మెంటర్ రాహుల్ ద్రావిడ్... అతన్ని ఐపీఎల్‌కి ఎంపిక చేశాడు...

ఐపీఎల్ 2013 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రవీణ్ తాంబేని కొనుగోలు చేసింది. అప్పటికి ప్రవీణ్ తాంబే వయసు 41 ఏళ్లు. మొత్తంగా ఐపీఎల్ కెరీర్‌లో 33 మ్యాచులు ఆడిన ప్రవీణ్ తాంబే, 28 వికెట్లు పడగొట్టాడు. 2014 సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు ప్రవీణ్ తాంబే...

కెరీర్ ఆరంభంలో బ్యాటర్‌గా, మీడియం పేస్ బౌలర్‌గా ప్రయత్నించిన ప్రవీణ్ తాంబే, లెగ్ స్పిన్నర్‌గా మారిన తర్వాత ఊహించని రీతిలో అవకాశాలు దక్కించుకున్నాడు. 2013 ఛాంపియన్స్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా గోల్డెన్ వికెట్ అవార్డు పొందిన ప్రవీణ్ తాంబే, 2014లో కేకేఆర్‌పై హ్యాట్రిక్ నమోదు చేశాడు...

2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ప్రవీణ్ తాంబేని కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో తాంబేకి ఒక్క అవకాశం కూడా దక్కలేదు. 2020 ఐపీఎల్‌లో ప్రవీణ్ తాంబేని కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. అయితే టీ10 లీగ్‌లో పాల్గొనడంతో ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు ప్రవీణ్ తాంబే...

50 ఏళ్ల వయసులోనూ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించని ప్రవీణ్ తాంబే, 2020 కరేబియర్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరుపున ఆడాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన మొదటి భారత క్రికెటర్‌గా నిలిచిన ప్రవీణ్ తాంబే, బిగ్‌బాష్ లీగ్ వంటి టోర్నీల్లో ఆడేందుకు కూడా ప్రయత్నించాడు. 

ఓ రకంగా నాని నటించిన ‘జెర్సీ’ మూవీ స్టోరీని పోలిన కథే ప్రవీణ్ తాంబే. అయితే అక్కడ జెర్సీ విషాందాంతం అయితే, ప్రవీణ్ తాంబే జీవితం 40+ వయసులో మొదలైంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios