ట్విస్టులు, హై డ్రామా! ‘టై’గా ముగిసిన ఇండియా vs బంగ్లాదేశ్ మూడో వన్డే.. అంపైర్‌పై హర్మన్‌ప్రీత్ ఫ్రస్టేషన్..
77 పరుగులు చేసిన హర్లీన్ డియోల్.. 34 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా... అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్..

బంగ్లాదేశ్ పర్యటనలో ఆఖరి వన్డేలో ఆశించిన దాని కంటే ఎక్కువ హై డ్రామానే నడిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.ఈ లక్ష్యఛేదనలో 41 ఓవర్లకే 191/4 స్కోరుతో ఈజీగా గెలిచేలా కనిపించిన భారత జట్టు, చివరి 9 ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయి చేజేతులా మ్యాచ్‌ని చేజార్చుకుంది..
తీవ్ర ఉత్కంఠ మధ్య ఆఖరి ఓవర్ వరకూ సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కూడా సరిగ్గా 225 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. తొలి వన్డేలో బంగ్లా, రెండో వన్డేలో టీమిండియా గెలవడంతో వన్డే సిరీస్ 1-1 తేడాతో డ్రా అయ్యింది..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ మహిళా జట్టు, 50 ఓవర్లలో 225 పరుగులకి ఆలౌట్ అయ్యింది. షమీమా సుల్తానా 78 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేయగా కెప్టెన్ నిగర్ సుల్తానా 36 బంతుల్లో ఓ ఫోర్‌తో 24 పరుగులు చేసింది. రితూ మోనీ 2 పరుగులు చేసి అవుట్ కాగా 160 బంతుల్లో 7 ఫోర్లతో 107 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్న ఫర్గానా హక్, రనౌట్ రూపంలో ఇన్నింగ్స్ ఆఖరి బంతికి పెవిలియన్ చేరింది..
22 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసిన శోభనా మోస్తరీ నాటౌట్‌గా నిలిచింది. 226 పరుగుల టార్గెట్‌కి బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి శుభారంభం దక్కలేదు. 3 బంతుల్లో ఓ ఫోర్ బాది 4 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, మరుఫా అక్తర్ బౌలింగ్‌లో ఆమెకే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. యషికా భాటియా 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి అవుట్ కాగా హర్లీన్ డియోల్, స్మృతి మంధాన కలిసి మూడో వికెట్‌కి 107 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
85 బంతుల్లో 5 ఫోర్లతో 59 పరుగులు చేసిన స్మృతి మంధానా, ఫహిమా ఖటున్ బౌలింగ్‌లో అవుట్ అయ్యింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 21 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి నహీదా అక్తర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యింది. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్, బెయిల్స్‌ని కాలితో తన్నుతూ అంపైర్‌ని తిడుతూ పెవిలియన్ చేరింది..
108 బంతుల్లో 9 ఫోర్లతో 77 పరుగులు చేసిన హర్లీన్ డియోల్ రనౌట్ అయ్యింది. హర్లీన్ డియోల్ అవుటయ్యే సమయానికి టీమిండియా విజయానికి 52 బంతుల్లో 35 పరుగులు మాత్రమే కావాలి. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. అయితే దీప్తి శర్మ 1, అమన్‌జోత్ కౌర్ 10, స్నేహ్ రాణా, దేవికా వైద్య డకౌట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన భారత జట్టు 217/9 స్థితికి చేరుకుంది..
మరో ఎండ్‌లో జెమీమా రోడ్రిగ్స్ 45 బంతుల్లో 33 పరుగులు చేసింది. ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చిన మేఘనా సింగ్ ఓ ఫోర్ బాది 6 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 3 పరుగులు కావాల్సి వచ్చాయి. తొలి బంతికి మేఘనా సింగ్ సింగిల్ తీసి జెమీమా రోడ్రిగ్స్‌కి స్ట్రైయిక్ ఇవ్వగా రెండో బంతికి జెమీమా మరో సింగిల్ తీసింది. దీంతో స్కోర్లు సమయం అయ్యాయి.
4 బంతుల్లో 1 పరుగు చేస్తే విజయం టీమిండియాదే. ఆఖరి ఓవర్ మూడో బంతికి మేఘనా సింగ్ ఆడిన షాట్, వికెట్ కీపర్ నిగర్ సుల్తానా చేతుల్లో వాలింది. అవుట్ కోసం బంగ్లాదేశ్ టీమ్ అప్పీల్ చేయడం, అంపైర్ అవుట్‌గా ప్రకటించడం జరిగిపోయాయి. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 225 పరుగులకి ముగిసింది..