టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య ఇవాళ టీ20 మ్యాచ్ జరగడం కాస్త అనుమానంగా  కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కు వాతావరణం సహకరించకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉరుములతో కూడిన భారీ వర్షం లేదంటే భారీగా కమ్ముకునే మేఘాలతో వెలుతురు మందగించడం వంటి అంతరాయం ఈ మ్యాచ్ కు ఎదురవవచ్చని ప్లోరిడా వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. ఈ  వార్త మ్యాచ్ ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న ఇరు దేశాల అభిమానులను ఆందోళనలోకి  నెట్టింది. 

భారత్-వెస్టిండిస్ లు తలపడే ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం కేవలం క్రికెట్ మ్యాచుల కోసమే నిర్మించింది కాదు. కాబట్టి మ్యాచ్ కు ముందు వర్షం కురిసినా మైదానంను వెంటనే సిద్దం చేయడానికి వీలు కాకపోవచ్చు. అలాగే పిచ్ తడిసినా వెంటనే సిద్దం చేసే యంత్రాంగం, మైదానంలో నీరు నిలవకుండా వుండేందుకు సమర్థవంతమైన డ్రైనేజి  సిస్టం ఈ మైదానంలో లేదు. కాబట్టి ఒకవేళ వర్షం  అంతరాయం కలిగిస్తే మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. 

ఈ టీ20 సీరిస్ లో భారత్ తో పాటు వెస్టిండిస్ జట్టు కూడా యువ ఆటగాళ్లను పరీక్షిస్తోంది. ఖారీ ఫెర్రీ, పూరన్, బ్రాంబెల్ వంటి యువకులను ఈ సీరిస్ కోసం ఎంపికచేసింది. ఇక భారత జట్టు కూడా రాహుల్ చాహర్, నవదీప్ సైనీ, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే వంటి యువ ఆటగాళ్లను ఈ సీరిస్ లో బరిలోకి దించుతోంది. ఇలా యువ రక్తంతో ఉరకలెత్తుతున్న ఇరు జట్లు  గెలుపే లక్ష్యంగా పోరాడనున్నాయి. అయితే తమ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశాలుండటంతో ఈ  ఆటగాళ్లు కూడా కాస్త నిరాశకు గురయ్యే అవకాశాలున్నాయి. అయితే వర్షం అంతరాయం కలగకుండా ఈ టీ20 మ్యాచ్ జరగాలని  వారితో పాటు అభిమానులుగా కోరుకుంటున్నారు.