Asianet News TeluguAsianet News Telugu

వెస్టిండీస్ తో తొలి వన్డే నేడే...భారత్ టార్గెట్ '10'

టెస్టుల్లో, టీ20ల్లో వరుస సిరీస్‌ విజయాలు సాధించిన భారత్‌.. ఇప్పుడు వెస్టిండీస్‌పై ఏకంగా వరుసగా పదో వన్డే సిరీస్‌ వేటకు బయల్దేరింది. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న కోహ్లిసేన.. పదో వన్డే సిరీస్‌ టైటిల్‌కు చెపాక్‌లో ఘనమైన బోణీ కొట్టాలని భావిస్తోంది. 

India vs Westindies: first oneday to begin from today...India eyes its tenth series victory
Author
Chennai, First Published Dec 15, 2019, 8:12 AM IST

టీమ్‌ ఇండియా పదిపై ఫోకస్‌ చేసింది. క్రికెట్‌ తొలినాళ్లలో వెస్టిండీస్‌పై విజయం అనే ఊహా కలలో సైతం ఊహించే సాహసం చేయలేదు భారత జట్టు. ఆధునిక క్రికెట్‌ను ఏలుతున్న టీమ్‌ ఇండియా ఏకంగా వెస్టిండీస్‌పై వరుసగా పదో వన్డే సిరీస్‌పై కన్నేసింది.

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అగ్రజట్టుగా ఎదిగిన భారత్‌ వరుసగా కరీబియన్‌ జట్టుపై విరుచుకుపడింది. వన్డేల్లో ఆ జట్టు ప్రదర్శన మరీ తీసికట్టుగా లేకపోయినా.. టీమ్‌ ఇండియాపై సిరీస్‌ విజయం ఆలోచనకు కరీబియన్లు కలలో కూడా సాహసం చేయలేని పరిస్థితి!. 

టెస్టుల్లో, టీ20ల్లో వరుస సిరీస్‌ విజయాలు సాధించిన భారత్‌.. ఇప్పుడు వెస్టిండీస్‌పై ఏకంగా వరుసగా పదో వన్డే సిరీస్‌ వేటకు బయల్దేరింది. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న కోహ్లిసేన.. పదో వన్డే సిరీస్‌ టైటిల్‌కు చెపాక్‌లో ఘనమైన బోణీ కొట్టాలని భావిస్తోంది. 

టెస్టుల్లో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌ పాయింట్లపై ఫోకస్‌ ఉండేది. టీ20 ఫార్మాట్‌లో 2020 టీ20 ప్రపంచకప్‌ ప్రణాళికలతో పోరు రసవత్తరంగా సాగింది. ఇప్పుడు వన్డే సిరీస్‌ వేట అనగానే చాంపియన్స్‌ ట్రోఫీ లేదు, వరల్డ్‌కప్‌ ఇప్పట్లో రాదు ఇక మజా ఏముంటుందిలే అనుకుంటే పొరపాటే. 

జట్ల బలాబలాల దృష్ట్యా భారత్‌, వెస్టిండీస్‌ నడుమ అగాధం కనిపిస్తున్నా ఈ రెండు జట్ల ముఖాముఖి పోరు ఎన్నడూ నిరాశపరిచిన చరిత్ర లేదు. అందుకే భారత్‌, వెస్టిండీస్‌ ముఖాముఖి అనగానే క్రికెట్‌ విందు అని చెప్పక తప్పదు. 

Also read: ఒక వైపే చూడు: కెఎల్ రాహుల్ దూకుడు వ్యూహం ఇదే...

ఉత్కంఠభరితంగా సాగిన టీ20 సిరీస్‌ను 2-1తో భారత్‌ గెల్చుకున్నా.. వెస్టిండీస్‌ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు వన్డేల్లోనూ కరీబియన్‌ బృందం అదే పోరాట స్ఫూర్తి కనబరచాలని తాపత్రయం. ఇదే సమయంలో వెస్టిండీస్‌పై భారత్‌ వరుసగా పదో వన్డే సిరీస్‌పై కన్నేయటంతో అరుదైన రికార్డు పరంగా ఈ సిరీస్‌ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్‌ ను ఆపతరమా...? 

ప్రపంచకప్‌ ఫేవరెట్‌గా సెమీఫైనల్లోనే టీమ్‌ ఇండియా కథ ముగిసినా 50 ఓవర్ల ఆటలో కోహ్లిసేన ఇప్పటికీ శత్రు దుర్బేద్య జట్టు. టాప్‌ ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి భీకర ఫామ్‌లో ఉన్నారు. 

రాహుల్‌, విరాట్‌ టీ20 సిరీస్‌లో విశ్వరూపం చూపించగా..ఆఖరు మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ చెలరేగాడు. నం.4లో శ్రేయస్ అయ్యర్‌ సైతం దొరికిన అవకాశాలను గొప్పగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. దీంతో బ్యాటింగ్‌ లైనప్‌లో భారత్‌ బలంగా కనిపిస్తోంది. లోయర్‌ ఆర్డర్‌లో రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, శివం దూబెలు సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు.

బౌలింగ్‌ విభాగంలో సీనియర్‌ సీమర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సేవలను భారత్‌ కోల్పోయింది. గాయంతో భువనేశ్వర్‌ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. మహ్మద్‌ షమి, దీపక్‌ చాహర్‌లు చెన్నైలో పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. 

స్పిన్‌ స్వర్గధామం చెపాక్‌లో కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వెంద్ర చాహల్‌ కలిసి మ్యాజిక్‌ చేయనున్నారు. వరల్డ్‌కప్‌ తర్వాత కుల్దీప్‌, చాహల్‌ తొలిసారి కలిసి మాయ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీనియర్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మాయలో భాగం కానున్నాడు. శివం దూబెకు అవకాశం లభిస్తే బంతితోనూ సత్తా చాటాలని చూస్తున్నాడు. 

మయాంక్‌ అగర్వాల్‌, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌లు తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. నేడు చెపాక్‌లో ఈ ముగ్గురు బెంచ్‌కు పరిమితం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

కరీబియన్లు కనీస పోటీ ఇవ్వగలరా ...? 

ఆధునిక క్రికెట్‌లో వెస్టిండీస్‌ ఆట శైలి పూర్తిగా మారిపోయింది. టీ20ల్లో మెరుస్తున్న విండీస్‌ వన్డే, టెస్టుల్లో నిలకడగా విఫలమవుతోంది. యువ ఆటగాళ్లు జట్టులోకి రావటంతో ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితి చక్కబడుతోంది. 

షిమ్రోన్‌ హెట్మయర్‌, బ్రాండన్‌ కింగ్‌, నికోలస్‌ పూరన్‌లు బ్యాటింగ్‌ లైనప్‌లో కీలకం కానున్నారు. టి20 సిరీస్ లో  హెట్మయర్‌, బ్రాండన్‌ కింగ్‌ రాణించారు. నికోలస్‌ పూరన్‌ వన్డేల్లో తనదైన ముద్ర చూపించాలని ఆశిస్తున్నాడు. 

Also read: నా నిర్ణయం సరైందే.. ఎవరితోనైనా చర్చకు సిద్ధం... రవిశాస్త్రి

ముంబయి టీ20లో గాయపడిన ఎవిన్‌ లెవిస్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. నేడు మ్యాచ్‌లో లెవిస్‌ ఆడతాడని విండీస్‌ ధ్రువీకరించింది. కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌కు వన్డేల్లో మెరుగైన రికార్డు లేదు. అయినా, జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత పొలార్డ్‌పై ఉంది. 

మరో ఆల్‌రౌండర్‌ రోస్టన్‌ ఛేజ్‌తో కలిసి ఆఖర్లో పొలార్డ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడితే వెస్టిండీస్‌ విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడతాయి. సునీల్‌ ఆంబ్రిస్‌, షై హోప్‌లు ఆరంభంలో శుభారంభం అందిస్తే విండీస్‌ పోటీనిచ్చే స్కోరు చేయగలదు. 

బౌలింగ్‌ విభాగంలో అల్జారీ జొసెఫ్‌, షెఫర్డ్‌ వచ్చినప్పటికీ షెల్డన్‌ కాట్రెల్‌ పేస్‌ దళానికి నాయకత్వం వహించనున్నాడు. స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌లో హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌ విండీస్‌కు ఎక్స్‌ ఫ్యాక్టర్‌ కాగలడు. కీమో పాల్‌, కారీ పీరే తుది జట్టులో చోటు కోసం పోటీపడుతున్నారు.

పిచ్‌, వాతావరణం : శుక్రవారం రాత్రి వర్షం కారణంగా మ్యాచ్‌కు ముందు రోజు టీమ్‌ ఇండియా నెట్‌ సెషన్‌లో సాధన చేయలేదు. మ్యాచ్‌ సమయంలో ఎటువంటి వర్ష సూచన లేదు. అయినా, రెండు జట్లు వాతావరణంపై ఓ కన్నేసి ఉంచాయి. చెన్నై చెపాక్‌ అనగానే స్పిన్‌ స్వర్గధామం. నేడు వన్డే మ్యాచ్‌కు పిచ్‌ స్వభావంలో ఎటువంటి మార్పు ఉండదు!. వర్షం లేకపోయినా రెండో ఇన్నింగ్స్‌కు మంచు ప్రభావం ఉంటుంది. టాస్‌ నెగ్గిన జట్టు ఛేజింగ్ వైపు మొగ్గు చూపనుంది.

తుది జట్లు (అంచనా) :

భారత్‌ : రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, శివం దూబె/ కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వెంద్ర చాహల్‌.

వెస్టిండీస్‌ : ఎవిన్‌ లెవిస్‌, సునీల్‌ ఆంబ్రిస్‌, బ్రాండన్‌ కింగ్‌, షిమ్రోన్‌ హెట్మయర్‌, నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పొలార్డ్‌, రోస్టన్‌ ఛేజ్‌, జేసన్‌ హౌల్డర్‌, షెల్డన్‌ కాట్రెల్‌, హెడెన్‌ వాల్ష్‌, కీమో పాల్‌.

Follow Us:
Download App:
  • android
  • ios