మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌-భారత్‌ల మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో వన్డే అనేక రికార్డులకు వేదికైంది. విండీస్ తరపున అత్యధిక వన్డేలు ఆడటంతో పాటు అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా క్రిస్‌గేల్ రికార్డుల్లోకి ఎక్కాడు.

ఇప్పటి వరకు ఈ రెండు రికార్డులు బ్రియాన్ లారా పేరిట ఉన్నాయి. లారా 299లు వన్డేలు ఆడి.. 10,405 పరుగులు చేశాడు. ఈ వన్డే ద్వారా గేల్ 300 వన్డేలు ఆడాడు. మ్యాచ్‌కు ముందు లారా రికార్డుకు 9 పరుగుల దూరంలో నిలిచిన గేల్ .. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టడం ద్వారా లారా రికార్డును బద్ధలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో విజయ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270 పరుగులకు కుదించారు. అయితే భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ 210 పరుగులకే అలౌటయ్యింది.