వెస్టిండిస్ పర్యటనలో కోహ్లీసేన అదరగొడుతోంది. ఇప్పటికే టీ20, వన్డే సీరీస్ లను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మిగిలిన టెస్ట్ సీరిస్ లో అదే ఫలితాన్ని రాబట్టాలని చూస్తోంది. ఈ టెస్ట్ సీరిస్ ద్వారా ఇరు జట్లు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ను మొదలుపెడుతున్నాయి. కాబట్టి ఎలాగైనా గెలిచి ఛాంపియన్‌షిప్ లో ముందడుగు వేయాలని భావిస్తున్నాయి. దీంతో భారత జట్టు  ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పక్కా వ్యూహాలతో బరిలోకి దిగాలనుకుంటోంది. అందుకోసం కెప్టెన్ కోహ్లీ కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ముఖ్యంగా ఈ టెస్ట్ సీరిస్ నుండి రోహిత్ శర్మను పక్కనబెట్టే అలోచనలో కోహ్లీ వున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు బౌలర్లలో బరిలోకి దిగితే తప్ప 20 వికెట్లను పడగొట్టడం అసాధ్యమని కోహ్లీ భావిస్తున్నాడట. అందుకోసం రోహిత్, అజింక్య  రహానేలలో ఎవరో ఒకరిని పక్కనబెట్టాల్సి రావొచ్చు. అయితే రోహిత్ కంటే రహానే టెస్ట్ క్రికెట్ కు తగినట్లుగా నెమ్మదిగా ఆడతాడు. అతడిపై టెస్ట్ క్రికెటర్ అన్నపేరు కూడా వుంది. అంతేకాకుండా అతడు టెస్ట్ క్రికెట్లో టీమిండియా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే రహానే కంటే రోహిత్ ను పక్కనపెట్టడమే మంచిదని కోహ్లీ భావిస్తున్నాడట. 

ఒకవేళ వీరిద్దరిని ఆడించాలంటే కోహ్లీ ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి ఐదుగురు బౌలర్లలో కాకుండా నలుగురు బౌలర్లతోనే బరిలోకి దిగడం. రెండోది ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగి బ్యాట్స్ మెన్స్ లో వేరేఎవరినైనా పక్కనబెట్టడం. అయితే ఈ రెండింటివల్ల భారత జట్టులో సమతూకం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నారు. 

భారత బ్యాటింగ్ లైనఫ్ విషయానికి వస్తే కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లు  ఓపెనింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీలు మూడు, నాలుగు స్థానాల్లో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. రిషబ్ పంత్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ కాబట్టి అతడు ధోని మాదిరిగానే ఆరో స్ధానంలో ఆడొచ్చు. ఆలౌరౌండర్ కోటాలో జడేజా ఏడో  స్థానంలో ఆడించొచ్చు. ఇందులో మిగిలింది  ఒక్క  ఐదోస్ధానమే. ఆ ఒక్కస్ధానం కోసం రోహిత్, రహానేల మధ్య పోటీ నెలకొంది. వీరిద్దలోనూ రహానే కే  ఆ స్ధానాన్ని భర్తీ  చేసే అవకాశాలు ఎక్కువగా  వున్నాయని క్రికెట్ పండితులు చెబుతున్నారు. 

ఇప్పటికే కోహ్లీ-రోహిత్ ల మధ్య విభేదాలున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో రోహిత్ ను టెస్ట్ సీరిస్ నుండి పక్కనబెడితే ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చినట్లు అవుతుంది. అలాకాకుండా జట్టు ప్రయోజనాలను పక్కనబెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం కూడా కుదరదు. ఇలా వెస్టిండిస్ టెస్ట్ సీరిస్ కోసం తుది జట్టు ఎంపిక కోహ్లీకి అగ్నిపరీక్షగా మారింది.