స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సీరిస్ లో విండీస్ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు తయారయ్యింది.ఇప్పటికే టీమిండియా చేతిలో వరుస ఓటములను చవిచూస్తూ ఆ జట్టు టీ20, వన్డే సీరిస్ లను కోల్పోయింది. దీంతో టెస్ట్ సీరిస్ అయినా గెలిచి పరువు నిలుపోవాలనుకుంటున్న విండీస్ కు మొదటి టెస్ట్ ఆరంభానికి ముందే పెద్ద  ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ కీమో పాల్ గాయం కారణంగా మొదటి టెస్టుకు  దూరమయ్యాడు. 

చీలమండల గాయంతో తమ ఆల్ రౌండర్ కీమోపాల్ బాధపడుతున్నట్లు వెస్టిడిస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అందువల్లే భారత జట్టుతో ఇవాళ్టి(గురువారం) నుండి మొదలవనున్న మొదటి టెస్ట్ ఆడించడం లేదని ప్రకటించారు. అతడి స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ మిగుల్ కమిన్స్ ను ఎంపికచేస్తూ వెస్టిండిస్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

అయితే మొదటి టెస్టుకు పాల్ దూరమైన రెండో టెస్ట్ వరకు అందుబాటులోకి వస్తాడన్న నమ్మకం వుందని బోర్డు తెలిపింది.  అందువల్ల అతడు జట్టుతో పాటే వుంటాడని స్పష్టం చేసింది. ప్రస్తుతం అతడు విండీస్ జట్టుకు సంబంధించిన డాక్టర్ల పర్యవేక్షణలో వున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. 

కీమో పాల్ స్థానంలో జట్టులో  చోటు దక్కించుకున్న కమిన్స్ కూడా చాలామంచి ఆటగాడని విండీస్ టీం మేనేజ్‌మెంట్ పేర్కొంది. అతడినుండి కూడా అద్భుత ప్రదర్శన ఆశించవచ్చని  తెలిపింది.  గతంలో భారత జట్టుపై అతడికి  మంచి రికార్డుంటంతో పాటు ఇటీవల భారత-ఏ జట్టుపై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. వీటిని దృష్టిలో వుంచుకునే అతడికి మొదటి టెస్ట్ లో అవకాశం  కల్పించినట్లు తెలిపారు.