Asianet News TeluguAsianet News Telugu

ముకేశ్ కుమార్‌కి తొలి టెస్టు వికెట్... వర్షం కారణంగా ఆగిన ఆట, టీమిండియా స్కోరుకి ఆమడ దూరంలో..

117 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. వర్షం కారణంగా ఆటకు అంతరాయం.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 321 పరుగుల దూరంలో విండీస్.. 

India vs West Indies 2nd Test: Mukesh Kumar picks 1st International wicket, team India huge lead CRA
Author
First Published Jul 22, 2023, 8:36 PM IST

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్‌, మొట్టమొదటి అంతర్జాతీయ వికెట్‌ని దక్కించుకున్నాడు. 57 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన కిర్క్ మెక్‌కెంజీ, ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

ఓవర్‌నైట్ స్కోరు 86/1 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన వెస్టిండీస్‌కి క్రెగ్ బ్రాత్‌వైట్, కిర్క్‌‌ మెక్‌కెంజీ కలిసి శుభారంభమే అందించారు. ఈ ఇద్దరూ 10.4 ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకోగలిగారు..

జయ్‌దేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్.. ఇలా కెప్టెన్ రోహిత్ శర్మ  బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. రెండో వికెట్‌కి 105 బంతుల్లో 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కెర్క్‌ మెక్‌కెంజీ అవుట్ కాగానే వర్షం కురవడంతో మ్యాచ్‌‌ని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు..

వాన కారణంగా ఆటకు అంతరాయం కలిగే సమయానికి 51.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది వెస్టిండీస్. విండీస్ కెప్టెన్ 161 బంతుల్లో 4 ఫోర్లతో 49 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 321 పరుగులు వెనకబడి ఉంది వెస్టిండీస్. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లు బ్యాటింగ్ చేసి 438 పరుగులకి ఆలౌట్ అయ్యింది.  యశస్వి జైస్వాల్ 74 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు చేయగా కెప్టెన్ రోహిత్ శర్మ 143 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు.  

అజింకా రహానే 8 పరుగులు చేసి అవుట్ కాగా విరాట్ కోహ్లీ 206 బంతుల్లో 11 ఫోర్లతో 121 పరుగులు చేసి.. టెస్టు కెరీర్‌లో 29వ సెంచరీ అందుకున్నాడు. సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు.

రవీంద్ర జడేజా 152 బంతుల్లో 5 ఫోర్లతో 61 పరుగులు చేసి అవుట్ కాగా రెండో టెస్టు ఆడుతున్న ఇషాన్ కిషన్ 37 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.. జయ్‌దేవ్ ఉనద్కట్ 7 పరుగులు చేసి అవుట్ కాగా మహ్మద్ సిరాజ్ 11 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. 78 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టుల్లో 14వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి ఇది 5 ఇన్నింగ్స్‌ల్లో 3వ 50+ స్కోర్. మిగిలిన రెండు సార్లు సెంచరీలు బాదాడు అశ్విన్.. 

వెస్టిండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జోమల్ వర్రీకాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీశాడు. షెన్నాన్ గ్యాబ్రియల్‌కి ఓ వికెట్ దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios