ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీ... రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్... విజయానికి 8 వికెట్ల దూరంలో భారత జట్టు..

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వరుణుడు ఎన్ని సార్లు అవంతరాలు కలిగించినా టీమిండియా విజయానికి అత్యంత చేరువగా వచ్చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 183 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 24 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది..

ఈ లక్ష్యఛేదనలో వెస్టిండీస్, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 32 ఓవర్లు బ్యాటింగ్ చేసి 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ విజయానికి ఇంకా 289 పరుగులు కావాల్సి ఉండగా టీమిండియా మరో 8 వికెట్లు తీయాలి. ఐదో రోజు రెండు సెషన్ల పాటు ఆట సాధ్యమైనా టీమిండియా ఈజీగా విజయాన్ని అందుకోగలదు. 

రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకి ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేయగా యశస్వి జైస్వాల్ 30 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చిన శుబ్‌మన్ గిల్ 37 బంతుల్లో ఓ ఫోర్‌తో 29 పరుగులు చేయగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసి టెస్టుల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు..

2022లో రిషబ్ పంత్, శ్రీలంకపై 28 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకోగా 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్... అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. 2006లో పాకిస్తాన్‌పై ధోనీ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి మూడో స్థానంలో ఉన్నాడు.

కీమర్ రోచ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ వరుసగా రెండు సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకోగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు రోహిత్ శర్మ. టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగానే మరోసారి వర్షం పలకరించింది. కాసేపు విరామం తర్వాత వెస్టిండీస్ బ్యాటింగ్‌కి వచ్చింది..

క్రెగ్ బ్రాత్‌వైట్, టగెనరైన్ చంద్రపాల్ కలిసి 18 ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకోగలిగారు. ఈ సమయంలో వికెట్ కోసం నాలుగో ఓవర్‌లోనే ఓ డీఆర్ఎస్ వాడేసింది టీమిండియా. 14వ ఓవర్‌లో అశ్విన్ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించినా బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కనిపించడంతో మరోసారి టీమిండియా వికెట్ కోల్పోయింది..

52 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసిన క్రెగ్ బ్రాత్‌వైట్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో జయ్‌దేవ్ ఉనద్కట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 18వ ఓవర్ ఆఖరి బంతికి టీమిండియాకి వికెట్ దక్కింది. టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్రెగ్ బ్రాత్‌వైట్ అవుట్ కావడం ఇది 8వ సారి. 

టెస్టుల్లో క్రెగ్ బ్రాత్‌వైట్‌‌ని ఎక్కువ సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా అశ్విన్ టాప్‌లో నిలిచాడు. జేమ్స్ అండర్సన్, కగిసో రబాడా ఏడేసి సార్లు బ్రాత్‌వైట్‌ని అవుట్ చేశారు. ఆ తర్వాత నాలుగు బంతులు ఆడి పరుగులేమీ చేయలేకపోయిన కిర్క్ మెక్‌కెంజీ, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 

44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. అయితే బ్లాక్‌వుడ్, చంద్రపాల్ కలిసి 12 ఓవర్ల పాటు మరో వికెట్ పడకుండా అడ్డుకోగలిగారు. చంద్రపాల్ 24, బ్లాక్‌వుడ్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.