ఇండోర్: శ్రీలంకతో మంగళవారం జరిగిన టీ20 మ్యాచులో విజయంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. శ్రీలంకపై రెండో టీ20 మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. బౌలర్లు, బ్యాట్స్ మెన్ అద్భుతమైన ప్రదర్శన చేశారని, తద్వారా విజయం సాధించామని కోహ్లీ అన్నాడు.

రోహిత్ శర్మ లేకపోయినప్పటికీ విజయం సాధించడం జట్టుకు సంబంధించి సానుకూలాంశమని ఆయన అన్నాడు. రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. జట్టుగా తాము సాధించదలుచుకున్న విజయమని, తాను సంతోషంగా ఉన్నానని, ఇది క్లినికల్ పెర్మార్మెన్స్ అని ఆయన అన్నాడు. 

రోహిత్ లేకపోయినప్పటికీ మంచి విజయం సాధించామని, జట్టుగా ఈ ప్రదర్శన సానుకూలమైన విషయమని అన్నాడు. కేవలం 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికైన నవదీప్ సైనీపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. 

నవదీప్ సైనీ వన్డేల్లో అడుగుపెట్టాడని, అయితే టీ20 ద్వారా అతను ఎక్కువ ఆత్మవిశ్వాసం పొందుతున్నాడని కోహ్లీ అన్నాడు. యార్కర్స్, బౌన్సర్లు, పేస్ తో బ్యాట్స్ మెన్ ను అవుట్ చేస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటుందని ఆయన అన్నారు. 

ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ జట్టు విషయంలో ఆశ్చర్యకరమైన ప్యాకేజీ ఉంటుందని కోహ్లీ చెప్పాడు. ఈ జట్టులోకి వచ్చే బౌలర్ ఎవరనే విషయం ఆయన వెల్లడించలేదు. టీ20 ప్రపంచ కప్ కోసం తగినంత బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయని అన్నాడు. 

ఆశ్చర్యకరంగా ఓ ఆటగాడు మాత్రం ప్రపంచ కప్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అన్నాడు. పేస్, బౌన్స్ తో బౌలింగ్  చేసే ఆటగాడు జట్టులోకి వస్తాడని ఆయన చెప్పారు. దేశవాళీ క్రికెట్ లో ప్రసిధ్ కృష్ణ బాగా రాణించాడని, ఈ విధమైన బౌలర్ల ద్వారా అన్ని ఫార్మాట్లలోనూ ఆడడం గ్రేట్ లగ్జరీ అని ఆయన అన్నాడు. 

జస్ ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరడం ఆనందంగా ఉందని కోహ్లీ అన్నాడు. బౌలింగ్ నైపుణ్యంలో అదే విధమైన ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుని సీనియర్లను ఎంపిక చేసుకుంటామని చెప్పాడు. 

శ్రీలంకతో మూడో టీ20 మ్యాచు జనవరి 10వ తేదీన మహారాష్ట్ర క్రికెట అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.