IND vs SA Test : స్వదేశంలో, సొంత అభిమానుల ముందు టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ చేతులెత్తేసి 408 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.  

India vs South Africa 2nd Test: గౌహతి టెస్టులో భారత జట్టు మరోసారి ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది. దీంతో టెంబా బావుమా కెప్టెన్సీలో ఆఫ్రికా జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 

కోల్‌కతాలో మొదటి టెస్ట్ కంటే దారుణమైన ఓటమిని రిషబ్ పంత్ కెప్టెన్సీలో భారత్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 201 పరుగులకే ఆలౌట్ అవ్వగా, రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 54 పరుగులు చేసినా జట్టు పరువును కాపాడలేకపోయాడు.

25 ఏళ్ల తర్వాత సిరీస్ గెలిచిన దక్షిణాఫ్రికా

టెంబా బావుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా మరో కొత్త చరిత్ర సృష్టించింది. గత 25 ఏళ్లుగా భారత గడ్డపై దక్షిణాఫ్రికా జట్టు ఏ టెస్ట్ సిరీస్ గెలవలేదు, కానీ ఇప్పుడు ఆ పరంపర ముగిసింది. గౌహతి టెస్ట్ ఐదో రోజు ఆఫ్రికా బౌలర్లు టీమిండియాను 140 పరుగులకే ఆలౌట్ చేసి 408 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేశారు. టెస్టుల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద ఓటమి. అదే సమయంలో 2000 తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ గెలిచింది.

 భారత్ ముందు కొండంత లక్ష్యం

గౌహతిలో గెలవాలంటే చివరి రోజు టీమిండియాకు 522 పరుగులు అవసరం, ఇది దాదాపు అసాధ్యం. భారత జట్టు చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. గెలుపు ఆశలు ముందే ఆవిరయ్యాయి కానీ మ్యాచ్‌ను డ్రా చేసుకునే అవకాశం ఉండింది. దీనికోసం బ్యాటర్లు రోజంతా ఆడాల్సింది. కానీ అది జరగలేదు, రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఘోర పరాజయం తప్పలేదు.

జడేజా తప్ప ఏ బ్యాటర్ రాణించలేదు

ఈ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 54 పరుగులు చేశాడు. అతను తప్ప ఏ బ్యాటర్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. కుల్దీప్ యాదవ్ నంబర్ 4లో వచ్చి 5 పరుగులే చేశాడు. యశస్వి జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6), సాయి సుదర్శన్ (14), ధ్రువ్ జురెల్ (2), రిషబ్ పంత్ (13), వాషింగ్టన్ సుందర్ (16), నితీష్ కుమార్ రెడ్డి (0), జస్ప్రీత్ బుమ్రా (1), మహ్మద్ సిరాజ్ (0) పరుగులు చేశారు. ఏ బ్యాటర్ కూడా 20 పరుగుల మార్కును దాటలేదు. సైమన్ హార్మర్ తన స్పిన్‌తో మరోసారి మాయ చేశాడు. అతను 6 వికెట్లు పడగొట్టాడు.