Asianet News TeluguAsianet News Telugu

తిప్పేసిన భారత బౌలర్లు... ఆఖరి వన్డేలో 100 మార్క్ దాటలేకపోయిన సఫారీ జట్టు...

27.1 ఓవర్లలో 99 పరుగులకి ఆలౌట్ అయిన సౌతాఫ్రికా... 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్...

India vs South Africa 3rd ODI: Kuldeep Yadav, Washington Sundar spells, south Africa failed to score
Author
First Published Oct 11, 2022, 4:23 PM IST

వీళ్లు మన బౌలర్లేనా? సౌతాఫ్రికాతో ఆఖరి వన్డే మ్యాచ్ చూసిన ఫ్యాన్స్‌కి ఈ అనుమానం వచ్చే ఉంటుంది. వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో భారత బౌలర్లు, సౌతాఫ్రికాని ఓ ఆటాడుకున్నారు. సఫారీ జట్టుకి కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుస వికెట్లు తీసి 99 పరుగులకే ఆలౌట్ చేశారు. వన్డేల్లో సౌతాఫ్రికాకి టీమిండియాపై ఇదే అత్యల్ప స్కోరు. 1999లో నైరోబీలో 117 పరుగులు చేసిన సౌతాఫ్రికా, ఆ రికార్డును తుడిచి పెట్టేసింది...

స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌తో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్ వేయించాడు కెప్టెన్ శిఖర్ ధావన్. 10 బంతుల్లో  ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ని అవుట్ చేసిన సుందర్, టీమిండియాకి తొలి బ్రేక్ అందించాడు. 27 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన జాన్నేమన్ మలాన్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ రెండు క్యాచ్‌లను ఆవేశ్ ఖాన్ అందుకోవడం విశేషం...

25 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో రీజా హెన్రిక్స్ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. 21 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసిన హెన్రిక్స్ కూడా సిరాజ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 19 బంతుల్లో 9 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, షాబజ్ అహ్మద్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా...
 
8 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 66 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. మిల్లర్ అవుటైన తర్వాతి ఓవర్‌లోనే 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన అదిల్ ఫెలూక్వాయోని క్లీన్ బౌల్డ్ చేశాడు కుల్దీప్ యాదవ్... 


42 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసిన్‌ని షాబజ్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బార్న్ ఫోర్టీన్, ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే అన్రీచ్ నోకియాని క్లీన్ బౌల్డ్ చేశాడు కుల్దీప్ యాదవ్...  19 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన మార్కో జాన్సన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో 27.1 ఓవర్లలో 99 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కి తెరపడింది. 

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కి 4 వికెట్లు దక్కగా వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, షాబజ్ అహ్మద్ రెండేసి వికెట్లు తీశారు. ఆవేశ్ ఖాన్ 5 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 8 పరుగులు మాత్రమే ఇవ్వడమే కాకుండా ఫీల్డింగ్‌లో మూడు క్యాచులు అందుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios