Asianet News TeluguAsianet News Telugu

సెంచూరియన్‌లో కుండపోత వర్షం... తొలి టెస్టు రెండో రోజు ఆట రద్దు చేసిన అంపైర్లు...

సెంచూరియన్ టెస్టు: కుండపోత వర్షం కారణంగా రెండో రోజు ఒక్క బంతి వేయకుండానే రద్దు చేసిన అంపైర్లు... ఐదో రోజు వర్షం పడే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ...

India vs South Africa 1st Test: Day 2 play has been called off due to rain in Centurion
Author
India, First Published Dec 27, 2021, 5:42 PM IST

టీమిండియా ఎక్కడ అడుగుపెడితే అక్కడ వారితో పాటు వరుణుడు కూడా ప్రత్యక్ష్యం అయిపోతాడు. ఇంగ్లాండ్ టూర్‌లో భారత జట్టును తెగ విసిగించిన వరుణుడు, సౌతాఫ్రికా టూర్‌లోనూ పలకరించేశాడు. తొలి రోజు ఎలాంటి ఆటంకం లేకుండా ఆట 90 ఓవర్ల పాటు సాగగా... రెండో రోజు వర్షం కారణంగా ఆట షెడ్యూల్ సమయానికి ప్రారంభం కాలేదు. సోమవారం ఉదయం వరుస విరామాల్లో వర్షం పడడంతో మొదటి సెషన్‌ను రద్దు చేసిన అంపైర్లు, ఆ తర్వాత ఎంతకీ వర్షం తగ్గకపోగా.. పెరుగుతూ ఉండడంతో రెండో రోజు ఆటను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదటి రోజు టీమిండియా ఆధిక్యం కొనసాగిస్తే, ఇక మిగిలిన మూడు రోజుల్లో టెస్టు మ్యాచ్ ఫలితం తేలడం కష్టంగానే మారనుంది. మ్యాచ్ ఐదో రోజు కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియచేసింది. 


అంతకుముందు సౌతాఫ్రికా టూర్‌ను భారత జట్టు మంచి పాజిటివ్‌ ఎనర్జీతో ఆరంభించింది. తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది టీమిండియా. తాత్కాలిక టెస్టు వైస్ కెప్టెన్సీ దక్కించుకున్న కెఎల్ రాహుల్ అజేయ సెంచరీతో చేలరేగగా... వైస్ కెప్టెన్సీ కోల్పోయిన అజింకా రహానే హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.

సెంచూరియన్ టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెఎల్ రాహుల్ 248 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 122 పరుగులు చేయగా, అజింకా రహానే 81 బంతుల్లో 8 ఫోర్లతో 40 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 131 బంతుల్లో 73 పరుగుల అజేయ భాగస్వామ్యం జోడించారు. 

మొదటి రోజు తొలి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా లంచ్ బ్రేక్‌కి వెళ్లిన భారత జట్టు, రెండో సెషన్‌లో మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారా వికెట్లను కోల్పోయింది. మూడో సెషన్‌లో దూకుడు పెంచిన భారత జట్టు, విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. ఓవరాల్‌గా తొలి రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం భారత్‌దే...

రోహిత్ శర్మ గైర్హజరీతో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టెస్టు వైస్ కెప్టెన్సీ దక్కించుకున్న కెఎల్ రాహుల్, ఉపసారథిగా ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్ టూర్‌లో మయాంక్ అగర్వాల్ గాయపడడంతో అనుకోకుండా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్‌కి గత నాలుగు టెస్టుల్లో రెండో సెంచరీ కావడం విశేషం. 2007లో కేప్‌టౌన్‌లో సెంచరీ చేసిన వసీం జాఫర్ తర్వాత సౌతాఫ్రికాలో శతకం బాదిన భారత ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. ఓ ఎండ్‌లో కెఎల్ రాహుల్‌ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుంటే, మరో ఎండ్‌లో మయాంక్ అగర్వాల్ బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 89 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు మయాంక్ అగర్వాల్...

సౌతాఫ్రికాలో టీమిండియా ఇప్పటిదాకా 21 టెస్టులు ఆడగా... ఓపెనర్లు శతాధిక భాగస్వామ్యం నమోదుచేయడం ఇది మూడోసారి. ఇంతకకుముందు 2006-07 పర్యటనలో కేప్ టౌన్ టెస్టులో వసీం జాఫర్, దినేశ్ కార్తీక్ కలిసి తొలి వికెట్‌కి 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

2010-11 సఫారీ టూర్‌లో సెంచూరియన్‌లోనే గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి తొలి వికెట్‌కి 137 పరుగులు జోడించారు. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ జోడించిన శతాధిక భాగస్వామ్యం మూడోది...

సెంచూరియన్‌లో ఆడిన గత 26 టెస్టుల్లో 21 టెస్టులు గెలిచింది సౌతాఫ్రికా. ఇందులో 52 ఇన్నింగ్స్‌ల్లో పర్యాటన జట్టు ఓపెనర్లు శతాధిక భాగస్వామ్యం జోడించడం ఇది రెండోసారి మాత్రమే కావడం మరో విశేషం...

విదేశాల్లో సెంచరీ భాగస్వామ్యంతో టెస్టు సిరీస్ ఆరంభించడం భారత జట్టుకి ఇదే తొలిసారి. ఇంతకుముందు 1936లో హింద్లేకర్, విజయ్ మర్చెంట్ కలిసి జోడించిన 62 పరుగులే అత్యుత్తమంగా ఉండేది...  

123 బంతులు ఎదుర్కొన్న మయాంక్ అగర్వాల్, 9 ఫోర్లతో 60 పరుగులు చేసి ఇంగిడి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 117 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...

మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాతి బంతికే ఛతేశ్వర్ పూజారా, భువుమాకి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

పూజారా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్‌తో కలిసి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఎంతో ఓపిగ్గా ఇన్నింగ్స్ నిర్మిస్తూ, సెంచరీ చేస్తాడని ఆశలు రేపిన కోహ్లీ, హఫ్ సెంచరీ మార్కు కూడా చేరుకోకుండానే పెవిలియన్ చేరాడు...

94 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఇంగిడి బౌలింగ్‌లో ముల్దార్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల్లో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్. టెస్టుల్లో 7వ సెంచరీ కాగా, విదేశాల్లో ఆరో టెస్టు సెంచరీ.

Follow Us:
Download App:
  • android
  • ios