South Africa vs India , 1st T20I : తొలి టీ20 వర్షార్పణం .. టాస్ కూడా పడకుండానే రద్దు
మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా - భారత్ జట్ల మధ్య డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.. వర్షం ఎంతకు తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్వాహకులు ప్రకటించారు.
మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా - భారత్ జట్ల మధ్య డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కనీసం టాస్ కూడా పడకుండా మ్యాచ్ రద్దవ్వడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. సాయంత్రం నుంచి (భారత కాలమానం ప్రకారం) డర్బన్‌లో చిరుజల్లులు పడుతూ వుండటంతో మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పివుంచారు. వర్షం తెరిపినిస్తే ఓవర్లు కుదించి అయినా మ్యాచ్‌ను కొనసాగించాలని భావించారు. కానీ వర్షం ఎంతకు తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్వాహకులు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ 20 డిసెంబర్ 12న జరగనుంది.
కాగా.. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో 4-1 తేడాతో భారత్ గెలిచింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌పై అందరి దృష్టి పడింది. భారత్ దక్షిణాఫ్రికాల మధ్య ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు జరగ్గా.. టీమిండియా 13, దక్షిణాఫ్రికా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. అలాగే భారత్ రెండు , దక్షిణాఫ్రికా ఒక్క సిరీస్‌ను దక్కించుకున్నాయి. మరో రెండు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్డిక్ పటేల్‌లు మ్యాచ్‌కు దూరమయ్యారు. అలాగే పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్ధితుల్లో భీకర బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ వున్న సఫారీలపై టీమిండియా కుర్రాళ్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.