Asianet News TeluguAsianet News Telugu

India vs New Zealand: ఒకే ఒక్క వికెట్... ఇండియాను అడ్డుకున్న కివీస్ భారత ప్లేయర్లు...

9 ఓవర్ల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడిన అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర... చరిత్రాత్మక డ్రాగా ముగిసిన కాన్పూర్ టెస్టు...

India vs New Zealand: Kanpur Test ends as Draw, Ajaz patel, Rachin Ravindra
Author
India, First Published Nov 29, 2021, 4:28 PM IST

ఒకే ఒక్క వికెట్... భారత జట్టును విజయం నుంచి దూరం చేసింది. ఐదు రోజుల పాటు హోరాహోరీగా సాగిన కాన్పూర్ టెస్టు చారిత్రక డ్రాగా ముగిసింది... చివరి నిమిషాల వరకూ తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన మ్యాచ్‌లో కివీస్ జట్టు ఆఖరి వికెట్‌ని కాపాడుకుని టెస్టును డ్రా చేసుకోగలిగింది. 

టెస్టు క్రికెట్‌లోని అసలు సిసలు మజాని క్రికెట్ ఫ్యాన్స్‌కి అందించిన ఈ మ్యాచ్‌లో బ్యాడ్‌లైట్‌ కూడా న్యూజిలాండ్‌కి కలిసి వచ్చింది. భారత సంతతి ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ కలిసి దాదాపు 9 ఓవర్ల పాటు వికెట్లకు అడ్డంగా నిలబడి, న్యూజిలాండ్‌కి చారిత్రాత్మక డ్రా అందించారు..

ఐదో రోజు పూర్తిగా 94 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, ఓవరాల్‌గా 98 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 4/1 వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్, తొలి సెషన్‌లో వికెట్లేమీ కోల్పోకుండా 35 ఓవర్లలో 79/1 పరుగులు చేసింది...  న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ విజయం కోసం ప్రయత్నించకపోవడం, డ్రా కోసం ఆడుతున్నట్టుగా జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోవడంతో టీమిండియా వికెట్ తీయడానికి ఆపసోపాలు పడింది.

అయితే లంచ్ బ్రేక్ తర్వాత మొదటి బంతికే విలియం సోమర్‌విల్లేని అవుట్ చేసి, టీమిండియాకి కావాల్సిన బ్రేక్ అందించాడు ఉమేశ్ యాదవ్. 110 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేసిన విలియం సోమర్‌విల్లే, శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్అ య్యాడు. 

ఆ తర్వాత దాదాపు 19.1 ఓవర్ల పాటు కేన్ విలియంసన్, టామ్ లాథమ్ కలిసి  క్రీజుకి అతుక్కుపోయారు. 146 బంతుల్లో 3 ఫోర్లతో 52 పరుగులు చేసిన టామ్ లాథమ్‌, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...  

టామ్ లాథమ్ వికెట్‌తో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్భజన్ సింగ్ (417 టెస్టు వికెట్లు) రికార్డును అధిగమించిన రవిచంద్రన్ అశ్విన్, టీమిండియా తరుపున అత్యధిక టెస్టు వికెట్లు మూడో బౌలర్‌గా నిలిచాడు.. భారత సీనియర్ బౌలర్ అనిల్ కుంబ్లే (619 వికెట్లు), కపిల్‌ దేవ్  (434 టెస్టు వికెట్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్...

ఆ తర్వాత 24 బంతుల్లో 2 పరుగులు చేసిన రాస్ టేలర్‌ను రవీంద్ర జడేజా అవుట్ చేయడంతో 125 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి టీ బ్రేక్‌కి వెళ్లింది న్యూజిలాండ్...

టీ బ్రేక్ తర్వాత రెండో ఓవర్‌లోనే హెన్రీ నికోలస్‌ను పెవిలియన్ చేర్చాడు అక్షర్ పటేల్. 112 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

38 బంతుల్లో 2 పరుగులతో జిడ్డు బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్ టామ్ బ్లండెల్‌ను రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే రచిన్ రవీంద్ర ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు. అయితే డీఆర్‌ఎస్ తీసుకున్న రవీంద్రకు అనుకూలంగా ఫలితం రావడంతో ఊపిరి పీల్చుకుంది కివీస్ టీమ్...

బ్లండెల్ వికెట్‌తో న్యూజిలాండ్‌పై 58 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, కివీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. బిషన్ సింగ్ బేడీ 57 వికెట్ల రికార్డును అధిగమించాడు అశ్విన్..

ఆ తర్వాత 30 బంతుల్లో 5 పరుగులు చేసిన కేల్ జెమ్మీసన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.  8 బంతుల్లో 4 పరుగులు చేసిన టిమ్ సౌథీ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో వికెట్లకు అడ్డుగా నిలబడిన ఆరంగ్రేట ఆటగాడు రచిన్ రవీంద్ర 91  బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేశాడు. అజాజ్ పటేల్ 23 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios