మెల్బోర్న్: మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీల్లో భారత మహిళా క్రికెటర్లు తమ జోరును కొనసాగిస్తున్నారు. గ్రూప్ ఏలో న్యూజిలాండ్ పై గురువారం తలపడిన ఇండియా విజయకేతనం ఎగురేసింది. దీంతో నేరుగా సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

షెఫాలీ వర్మ 34 బంతుల్లో 46 పరుగులు చేసి బారత విజయంలో కీలక పాత్ర పోషించింది. మూడో ఓవరులో స్మృతి మంధాన అవుటైన తర్వాత ఇన్నింగ్స్ నిర్మించే భారాన్ని షెఫాలీ వర్మ తన భుజస్కంధాలపై మోసింది. 

చివరి ఓవరు వరకు సాగిన ఉత్కంఠభరితమైన మ్యాచులో మూడు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ బ్యాట్స్ వుమన్ అమెలీ కెర్ర్ ధాటిగా ఆడినా ఇండియా అదుపు చేయగలిగింది. 

పూనమ్ యాదవ్ వేసిన 19వ ఓవరులో అమెలియా కెర్ర్ నాలుగు ఫోర్లు కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. చివరి ఓవరులో కివీస్ 16 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే చివరి ఓవరులో లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 134 పరుగుల లక్షాన్ని ఛేదించే క్రమంలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, ఆర్పీ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.