India vs England Highlights: రాంచీ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజయం దిశగా ముందుకు సాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ మూడో రోజును అద్భుతంగా ముగించింది.
India vs England Highlights: భారత్-ఇంగ్లాండ్ 4 టెస్టు మ్యాచ్ లో మూడో రోజును టీమిండియా అద్భుతంగా ముగించింది. అన్ని విషయాల్లోనూ మెరుగైన ఆటతో అదరగొట్టింది. మరో విజయం దిశగా ముందుకు సాగుతోంది. రాంచీ టెస్టులో 192 పరుగుల ఛేదనలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ దూకుడు ఆటతో భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులకు చేరుకుంది. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు, కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టడంతో భారత్ ఇంగ్లండ్‌ను 145 పరుగులకే కట్టడి చేసింది. త్రీ లయన్స్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగుల స్కోరును కూడా దాటేందుకు కష్టపడటంతో 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని భారీగా పెంచడంలో విఫలమైంది.
జురెల్ సెంచరీ మిస్..
రాంచీ టెస్టు 2వ రోజు ఇంగ్లాండ్ ప్లేయర్ షోయబ్ బషీర్ సంచలనాత్మక (4/84) బౌలింగ్ తో భారత్ 219/7 పరుగులతో ఆటను ముగించింది. ఇక మూడో రోజు ధృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్ లు ప్రారంభించారు. జురెల్ అద్భుతమైన ఆటతో అడుగు దూరంలో సెంచరీ కోల్పోయాడు. 90 పరుగుల ఇన్నింగ్స్ తో భారత్ స్కోర్ ను 300 మార్కును దాటించాడు. అంతకుముందు యశస్వి జైస్వాల్ 73 పరుగులు చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ను 307 పరుగులకు ముగించింది. 90 పరుగుల తన ఇన్నింగ్స్ లో జురెల్ 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.
అశ్విన్, జడేజా కుల్దీప్ మాయాజాలం..
మూడో రోజు భారత బౌలర్లు ఇంగ్లాండ్ ప్లేయర్లను చెడుగుడు ఆడుకున్నారు. అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు తీసుకోగా, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. అశ్వన్ బెట్ డకెట్ వికెట్ తో ఇంగ్లాండ్ పతనాన్ని షురూ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు పోటీ పడి తమ సూపర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను రెండో ఇన్నింగ్స్ లో 144 పరుగులకు ఆలౌట్ చేశారు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ లో జాక్ క్రాలీ 60, బెయిర్ స్టో 30 పరుగులు చేయగా, మిగతా ప్లేయర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలువలేకపోయారు.
భారత బౌలర్లలో అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్ 4, రవీంద్ర జడేజా 1 వికెట్ తీసుకున్నాడు. భారత్ ముందు ఇంగ్లాండ్ 192 పరుగుల టార్గెట్ ను ఉంచింది. రెండో ఇన్నింగ్స్ దూకుడుగా ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 40 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ 24 పరుగులు, యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకా భారత్ విజయానికి 152 పరుగులు కావాలి. రాంచీలో గెలిచి ఇంకో మ్యాచ్ మిగిలి వుండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది.
