India vs England 5th Test Day 3: 25 పరుగులు చేసి అవుటైన బెన్ స్టోక్స్... హాఫ్ సెంచరీ చేసుకున్న జానీ బెయిర్ స్టో... జానీ, విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్ధం... 

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో మొదటి రెండు రోజులు టీమిండియా ఆధిపత్యం చెలాయించగా మూడో రోజు తొలి సెషన్‌లో మాత్రం ఇంగ్లాండ్ బ్యాటర్ల డామినేషన్ కొనసాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 84/5 వద్ద మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్‌కి కెప్టెన్ బెన్ స్టోక్స్, ఇన్ ఫామ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో కలిసి శుభారంభం అందించారు...

మొదటి నాలుగు ఓవర్లు ఇద్దరూ కూడా వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో సింగిల్స్ మాత్రమే వచ్చాయి. అయితే ఈ దశలో విరాట్ కోహ్లీ, జానీ బెయిర్‌స్టోని సెడ్జింగ్ చేశాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో చాలాసార్లు బౌలర్లను ఆపడంతో... విరాట్ కోహ్లీ ‘నీకు బాల్ తప్ప అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి...’ అంటూ సెడ్జ్ చేశాడు. ఈ మాటలకు జానీ బెయిర్‌స్టో కూడా ఏదో మాట అనడంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది...

బెన్‌ స్టోక్‌, అంపైర్లు కూడా కలుగచేసుకుని విరాట్ కోహ్లీని శాంతించాల్సిందిగా కోరారు. దీంతో జానీ బెయిర్‌స్టోని నవ్వుతూ భుజం తట్టిన విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ పొజిషన్‌కి వెళ్లిపోయాడు. అయితే ఈ సంఘటన తర్వాత జానీ బెయిర్‌స్టో ఆటతీరు పూర్తిగా మారిపోవడం విశేషం.

అప్పటిదాకా 64 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన జానీ బెయిర్‌స్టో, విరాట్ కోహ్లీతో గొడవ తర్వాత 17 బంతుల్లో 34 పరుగులు రాబట్టాడు. మొత్తంగా 81 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు జానీ బెయిర్‌స్టో. మరోవైపు క్రీజులో కుదురుకోవడానికి కాస్త ఇబ్బంది పడిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని డ్రాప్ చేశాడు శార్దూల్ ఠాకూర్...

శార్దూల్ ఠాకూర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో 18 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బెన్ స్టోక్స్, ఆఖరికి అతని బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరడం విశేషం. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బెన్ స్టోక్స్... అంతకుముందు బంతికి బెన్ స్టోక్స్ ఇచ్చిన షాట్‌ని క్యాచ్ అందుకోలేకపోయిన జస్ప్రిత్ బుమ్రా, ఆ తర్వాతి బాల్‌ని కళ్లు చెదిరే క్యాచ్‌గా మలిచాడు. 36 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ అవుటయ్యే సమయానికి 37.4 ఓవర్లలో 124 పరుగులు చేసింది ఇంగ్లాండ్...