Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్ ఓపెనర్ల దూకుడు... వన్డే స్టైల్‌లో బౌండరీలు బాదుతూ టీమిండియా బౌలర్లకు చుక్కలు..

India vs England 5th Test: తొలి వికెట్‌కి 20 ఓవర్లలోనే సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రావ్లే, అలెక్స్ లీస్... 

India vs England 5th Test: England Openers Zak Crawley, Alex Lees dominates Indian Bowlers
Author
India, First Published Jul 4, 2022, 7:53 PM IST

సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో 377 భారీ టార్గెట్‌ ఛేదనలో అదిరిపోయే ఆరంభం అందించారు ఇంగ్లాండ్ ఓపెనర్లు. మొదటి ఓవర్ నుంచి భారత బౌలర్లపైకి ఎదురుదాడికి దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు.. బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు...


తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయిన ఇంగ్లాండ్ ఓపెనర్లు, రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. అలెక్స్ లీస్ 48 బంతుల్లో 8 ఫోర్లతో 53 పరుగులు చేసి  కెరీర్‌లో రెండో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 

మరో ఎండ్‌లో జాక్ క్రావ్లే కూడా దూకుడు చూపిస్తూ ఎదురుదాడి చేస్తున్నాడు. సిరాజ్  బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన జాక్ క్రావ్లే, ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ ఓవర్‌లోనూ రెండు ఫోర్లు రాబట్టాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 19.5 ఓవర్లలో 100 పరుగులు జోడించి, టీమిండియాకి ఊహించిన షాక్ అందించారు... ఈ ఇద్దరినీ ఎంత త్వరగా అవుట్ చేస్తే, టీమిండియాకి అంత మంచిది..

అంతకుముందు భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఐదో టెస్టులో గెలవాలంటే ఇంగ్లాండ్ జట్టు 377 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇప్పటిదాకా ఏ జట్టూ కూడా నాలుగో ఇన్నింగ్స్‌లో 300+ స్కోరు చేసింది లేదు. మ్యాచ్‌లో ఇంకా 150 ఓవర్లకు పైగా మిగిలే ఉండడంతో ఈ టెస్టు మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలన్నా ఇంగ్లాండ్‌ కష్టపడకతప్పదు..

ఓవర్‌నైట్ స్కోరు 125/3 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, 81.5 ఓవర్లలో ఆలౌట్ అయ్యింది. ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్ కలిసి నాలుగో వికెట్‌కి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టెస్టుల్లో 33వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఛతేశ్వర్ పూజారా 168 బంతుల్లో 8 ఫోర్లతో 66 పరుగులు చేసి స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో అలెక్స్ లీస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...  

విదేశాల్లో 100కి పైగా బంతులను ఫేస్ చేయడం ఛతేశ్వర్ పూజారాకి ఇది 24వ సారి. రాహుల్ ద్రావిడ్ (38 సార్లు), సచిన్ టెండూల్కర్ (32 సార్లు), విరాట్ కోహ్లీ (25 సార్లు) మాత్రమే పూజారా కంటే ముందున్నారు... 2021 నుంచి ఛతేశ్వర్ పూజారాకి ఇది 8వ హాఫ్ సెంచరీ. 

టీమిండియా తరుపున గత రెండేళ్లలో అత్యధిక టెస్టు హాఫ్ సెంచరీలు చేసిన భారత ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు ఛతేశ్వర్ పూజారా. రిషబ్ పంత్ 7 హాఫ్ సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉండడం విశేషం...  SENA దేశాల్లో పూజారాకి ఇది 18వ హాఫ్ సెంచరీ.

పూజారా అవుటైన తర్వాత రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ 77 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేసిన రిషబ్ పంత్, రెండో ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేసి... విదేశాల్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. 

పూజారా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, 26 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి మ్యాటీ పాట్స్ బౌలింగ్‌లో జేమ్స్ అండర్సన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 190 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు... 

86 బంతుల్లో 8 ఫోర్లతో 57 పరుగులు చేసిన రిషబ్ పంత్, జాక్ లీచ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కి ప్రయత్నించి జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ 26 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ కాగా మహ్మద్ షమీ 14 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

58 బంతుల్లో ఓ ఫోర్‌తో 23 పరుగులు చేసిన రవీంద్ర జడేజాని క్లీన్ బౌల్డ్ చేసిన బెన్ స్టోక్స్, 20 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేసిన కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రాని అవుట్ చేయడంతో భారత ఇన్నింగ్స్‌కి తెరపడింది. మహ్మద్ సిరాజ్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్‌కి నాలుగు వికెట్లు దక్కగా  స్టువర్ట్ బ్రాడ్, మ్యాట్ పాట్స్ రెండేసి వికెట్లు తీశారు. జేమ్స్ అండర్సన్, జాక్‌ లీచ్‌లకు చెరో వికెట్ దక్కింది.  భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయగా ఇంగ్లాండ్ జట్టు 284 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios