Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాతో ఐదో టెస్టు: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... ఓపెనర్‌గా ఛతేశ్వర్ పూజారా...

India vs England 5th Test: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్... మయాంక్ అగర్వాల్‌కి తుది జట్టులో దక్కని చోటు, ఓపెనర్‌గా పూజారా... 

India vs England 5th Test: England captain Ben Stokes won the toss and elected to field first
Author
India, First Published Jul 1, 2022, 2:45 PM IST

టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. రోహిత్ శర్మ కరోనా బారిన పడడం, కెఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో శుబ్‌మన్ గిల్‌తో కలిసి సీనియర్ టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా ఓపెనింగ్ చేయబోతున్నాడు...

కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రాకి ఇది మొట్టమొదటి మ్యాచ్‌. టీమిండియాకి కెప్టెన్సీ చేసిన మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్‌‌గా బుమ్రా రికార్డు క్రియేట్ చేశాడు... ఇంతకుముందు టీమిండియాకి ఐదుగురు బౌలర్లు కెప్టెన్లుగా వ్యవహరించినా వారంతా స్పిన్నర్లే కావడం విశేషం..

గత ఏడాది సెప్టెంబర్‌లో మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు, భారత బృందంలో కరోనా కేసుల కారణంగా అప్పుడు వాయిదా పడి... ఇన్నాళ్లకు జరగనుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ నిర్ణయాత్మక ఐదో టెస్టును డ్రా చేసుకున్నా... సిరీస్ సొంతం చేసుకుంటుంది. అయితే నాలుగు టెస్టుల్లో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా ఉన్న కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ... ఈ మ్యాచ్‌కి అందుబాటులో లేకపోవడం భారత జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది..

కరోనా బారిన పడిన రోహిత్ శర్మకు స్టాండ్ బై ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌ని ఇంగ్లాండ్‌కి రప్పించినా అతనికి తుది జట్టులో చోటు కల్పించలేదు టీమిండియా. దీంతో ఛతేశ్వర్ పూజారా, శుబ్‌మన్ గిల్ ఓపెనర్లుగా రాబోతుంటే హనుమ విహారి వన్‌డౌన్‌లో, విరాట్ కోహ్లీ టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి వస్తారు. గాయం కారణంగా ఈ టెస్టుకి దూరమైన అజింకా రహానే స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయబోతున్నాడు...

స్వింగ్‌కి అనుకూలించే పిచ్‌ కావడంతో భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కి తుదిజట్టులో చోటు దక్కింది. శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాల రూపంలో నలుగురు ఫాస్ట్ బౌలర్లను తుది జట్టులోకి తీసుకున్న టీమిండియా, స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకి చోటు కల్పించింది. ఇంగ్లాండ్‌లో జరిగిన మొదటి నాలుగు టెస్టుల్లో ఆడలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్‌కి మరోసారి నిరాశే ఎదురైంది...

బెన్ స్టోక్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది ఇంగ్లాండ్. బ్రెండన్ మెక్‌కల్లమ్ హెడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత వారి ఆటతీరు, యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయాయి. దీంతో భారత జట్టుతో ఇంగ్లాండ్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

భారత జట్టు: శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా (కెప్టెన్)

ఇంగ్లాండ్ జట్టు: అలెక్స్ లీస్, జాక్ క్రావ్లీ, ఓల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, మ్యాటీ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్

Follow Us:
Download App:
  • android
  • ios