న్యూఢిల్లీ: టీమిండియా బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీలను వెనక్కి నెట్టాడు. భారత్ తరఫున ధోనీ కన్నా ఎక్కువ టీ20లు ఆడిన బ్యాట్స్ మన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. 2007 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా భారత్ జట్టులోకి వచ్చిన అతను ఇప్పటి వరకు 98 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. 

రోహిత్ శర్మ కన్నా ముందు ధోనీ 98 మ్యాచులతో కొనసాగుతున్నాడు. దీంతో ఆదివారం బంగ్లాదేశ్ తో తన 99వ మ్యాచ్ ఆడి ధోనీని రోహిత్ శర్మ దాటేశాడు. టీ20 ఫార్మాట్ లో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (111) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

ఆ తర్వాతి స్థానాల్లో 99 మ్యాచులు ఆడి షాహిద్ ఆఫ్రిది, రోహిత్ శర్మ నిలిచారు. దీంతో పాటు టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును కూడా రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ 2450 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 2453 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తో తొలి మ్యాచులో 9 పరుగులు చేసి రోహిత్ శర్మ ఆ మైలురాయిని చేరుకున్నాడు. 

బంగ్లాదేశ్ తో తొలి టీ20 మ్యాచులో రోహిత్ శర్మ కేవలం 9 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో బంగ్లాదేశ్ తో జరుగుతున్న సిరీస్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. 

అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ నాలుగు సెంచరీలు, 17 అర్థ సెంచరీలు చేశాడు. బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఇండియాపై టీ20ల్లో విజయం సాధించలేదు. ఈసారి కూడా అదే పునరావృతమైతే రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకునే అవకాశం ఉంటుంది.