టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయి చేరుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12వేల పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. 251వ వన్డే ఆడిన విరాట్..242 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించాడు. దీంతో.. అత్యంత వేగంగా 12వేల పరుగులు సాధించిన జాబితాలో కోహ్లీ చేరడమే కాకుండా..  అప్పటి వరకు సచిన్ టెండుల్కర్ పేరున్న రికార్డు ను కూడా కోహ్లీ దాటేశాడు.

సచిన్‌ 300 (309 మ్యాచుల్లో) ఇన్నింగ్స్‌లో ఆ రికార్డు చేరుకున్నాడు. వన్డేల్లో వేగంగా 8వేలు, 9వేలు, 10 వేలు, 11వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులన్నీ కూడా కోహ్లీ పేరిటే ఉన్నాయి. అత్యంత వేగంగా 12వేల పరుగుల మైలురాయి అందుకున్న విరాట్‌ కోహ్లీ.. ఇదే మ్యాచ్‌తో పేలవమైన రికార్డునూ మూటగట్టుకున్నాడు. వన్డేల్లో విరాట్‌ ఈ సంవత్సరం ఒక్క శతకం కూడా కొట్టలేకపోయాడు. 

దీంతో ఓ ఏడాదిని వన్డే సెంచరీ లేకుండా ముగించడం 11 ఏళ్ల తర్వాత అతనికిదే తొలిసారి. 2008లో వన్డే అరంగేట్రం చేసిన విరాట్‌.. 2009 నుంచి ప్రతి ఏటా కనీసం ఒక సెంచరీ అయినా బాదాడు. 2017, 2018లో ఆరేసి శతకాలు సాధించాడు. కానీ.. ఈ ఏడాది మాత్రం మూడంకెల స్కోరు చేయలేకపోయాడు.

విరాట్‌ వరుసగా నాలుగో వన్డేలోనూ ఒకే బౌలర్‌కు వికెట్‌ సమర్పించుకున్నాడు. ఈ అరుదైన రికార్డును ఆసీస్‌ బౌలర్‌ హాజెల్‌వుడ్‌ దక్కించుకున్నాడు. ఈ సిరీ్‌సలో వరుసగా మూడు వన్డేల్లోనూ విరాట్‌ను అవుట్‌ చేసిన హాజెల్‌వుడ్‌.. అంతకుముందు బెంగళూరులో జరిగిన చివరి వన్డేలో కోహ్లీ వికెట్‌ను పడగొట్టాడు.