INDvsAUS 3rd Test: 40 ఓవర్లు ముగిసే సమయానిక 2 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి ఆస్ట్రేలియా... తొలి ఇన్నింగ్స్ 11 పరుగుల ఆధిక్యం, చేతిలో 8 వికెట్లు... రెండు వికెట్లు తీసిన జడేజా, రెండు డీఆర్‌ఎస్ రివ్యూస్ వృథా... 

ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిక్యం సంపాదించుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 109 పరుగులకి ఆలౌట్ కాగా 37 ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... 2 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉండడంతో పాటు స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ వంటి బ్యాటర్లు రావాల్సి ఉండడంతో ఆస్ట్రేలియాకి భారీ ఆధిక్యం దక్కే అవకాశం ఉంది...

భారత జట్టును 33.2 ఓవర్లలోనే ఆలౌట్ చేసిన ఆసీస్‌కి శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ట్రావిస్ హెడ్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు రవీంద్ర జడేజా. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న టీమిండియాకి ఫలితం దక్కింది...

ఆ తర్వాతి ఓవర్‌లో మార్నస్ లబుషేన్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు రవీంద్ర జడేజా. అయితే అది నో బాల్‌గా తేలడంతో లబుషేన్ నాటౌట్‌గా తేలాడు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా కోసం రెండు సార్లు రివ్యూ తీసుకుని, ఫలితం రాబట్టలేకపోయింది టీమిండియా. రెండు డీఆర్‌ఎస్ రివ్యూలు వృథా కావడంతో ఆ తర్వాత జాగ్రత్త పడింది టీమిండియా...

ఇది ఆస్ట్రేలియాకి కలిసి వచ్చింది. లబుషేన్ 7 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేసింది టీమిండియా. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఒకే రివ్యూ మిగలడంతో డీఆర్‌ఎస్ తీసుకోలేదు రోహిత్. అయితే టీవీ రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించింది..

102 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఉస్మాన్ ఖవాజాతో కలిసి రెండో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు మార్నస్ లబుషేన్. అదృష్టం కలిసి రావడంతో మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్నస్ లబుషేన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

91 బంతులు ఆడిన మార్నస్ లబుషేన్ ఓ ఫోర్‌తో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. నాలుగో ఓవర్‌లో అవుట్ కావాల్సిన లబుషేన్, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి 1 పరుగు దూరంలో నిలిచిన తర్వాత 34వ ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. 

ఈ సిరీస్‌లో జడేజా వికెట్ తీసిన తర్వాత నో బాల్‌గా తేలడంతో బ్యాటర్లు నాటౌట్‌గా నిలవడం ఇది మూడో సారి. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను రెండు ఎండ్‌లలో కొనసాగించిన రోహిత్ శర్మ, అక్షర్ పటేల్‌కి బౌలింగ్‌ ఇవ్వడానికి పెద్దగా ఇష్టపడలేదు...

ఉమేశ్ యాదవ్ 2 ఓవర్లు బౌలింగ్ చేసి సైడ్ కాగా 35 ఓవర్లు ముగిసిన తర్వాత మహ్మద్ సిరాజ్‌ని బౌలింగ్‌లోకి తీసుకొచ్చాడు రోహిత్ శర్మ. స్పిన్నర్లను ఉస్మాన్ ఖవాజా, లబుషేన్ సమర్థవంతంగా వారినే కొనసాగించడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకి 180+ దక్కితే ఈ టెస్టు మ్యాచ్‌ని కాపాడుకోవడం టీమిండియాకి కష్టమైపోతుంది. భారత బ్యాటర్లు బ్యాటింగ్ చేయడానికి ముప్పుతిప్పలు పడిన చోట, ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎంతో సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేసి పరుగులు రాబడుతుండడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 300+ పరుగులు చేసేలా కనిపిస్తోంది..