India vs Australia 3rd test: రెండో రోజు టీ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసిన భారత జట్టు... ఇంకా 9 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా! 

ఇండోర్ టెస్టులో టీమిండియా బ్యాటర్లు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన టాపార్డర్ బ్యాటర్లు, రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే స్టైల్‌లో పెవిలియన్ చేరారు. రెండో రోజు టీ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది భారత జట్టు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 9 పరుగుల దూరంలో ఉంది భారత జట్టు. ఛతేశ్వర్ పూజారా 36, శ్రేయాస్ అయ్యర్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు.

5 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ని, నాథన్ లియాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. 33 బంతుల్లో 12 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నాథన్ లియాన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...

26 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మ్యాట్ కుహ్నేమన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత జట్టు.. ఈ దశలో రవీంద్ర జడేజా, ఛతేశ్వర్ పూజారా కలిసి నాలుగో వికెట్‌కి 24 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

36 బంతుల్లో 7 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. జడ్డూ అవుట్ అయ్యే సమయానికి ఇంకా 10 పరుగుల ఆధిక్యంలో ఉంది ఆస్ట్రేలియా...

 దానికి ముందు ఓవర్‌నైట్ స్కోరు 156/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా, తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియాపై 88 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది ఆస్ట్రేలియా. రెండో రోజు మొదటి గంటలో పీటర్ హ్యాండ్స్‌కోంబ్, కామెరూన్ గ్రీన్ కలిసి శుభారంభం ఐదో వికెట్‌కి 40 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో టీమిండియాకి వికెట్ దక్కలేదు...

అయితే డ్రింక్స్ బ్రేక్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. 98 బంతుల్లో ఓ ఫోర్‌తో 19 పరుగులు చేసిన పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ని అశ్విన్ అవుట్ చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు హ్యాండ్స్‌కోంబ్. ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ మ్యాజిక్ చూపించాడు...

57 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 1 పరుగు చేసిన మిచెల్ స్టార్క్‌ని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు...

3 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. టాడ్ ముర్ఫీని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో వెంటవెంటనే 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా... 5 పరుగులు చేసిన నాథన్ లియాన్‌ని రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కి 197 పరుగుల వద్ద తెరపడింది.

ఒకానొక దశలో 186/4 స్కోరుతో ఉన్న ఆస్ట్రేలియా, 5.3 ఓవర్లు ముగిసే సరికి 197/10 స్థితికి చేరుకుంది. ఆఖరి 6 వికెట్లను 12 పరుగుల తేడాలో కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు.. 

భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ చెరో మూడేసి వికెట్లు తీయగా ఆస్ట్రేలియా కోల్పోయిన మొదటి 4 వికెట్లు రవీంద్ర జడేజా పడగొట్టాడు. ట్రావిస్ హెడ్ 9, ఉస్మాన్ ఖవాజా 60, మార్నస్ లబుషేన్ 31, స్టీవ్ స్మిత్ 26 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యారు..