ENG vs IND: ఇంగ్లాండ్ పై ఎడ్జబాస్టన్ టెస్టులో ఓడినా టీ20లలో ఆ జట్టుకు ధమ్కీ ఇచ్చిన టీమిండియా వన్డేలలో కూడా అదే విధంగా షాకివ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలి మ్యాచ్ ను నెగ్గిన భారత జట్టు రెండో వన్డేలో కూడా గెలిచి ఆదివారం వరకు వేచి చూడకుండా సిరీస్ పట్టేయాలని భావిస్తున్నది. తొలి వన్డేలో మన బౌలింగ్ ప్రదర్శన ఆకట్టుకోగా బ్యాటింగ్ లో కూడా ఓపెనర్లే కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఇదే ఊపులో రెండో వన్డేలో కూడా చెలరేగితే సిరీస్ పట్టేయడం పెద్ద కష్టమేం కాదు. లార్డ్స్ లో జరుగుతున్న రెండో వన్డే లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
అయితే తొలి వన్డే ఓడినంత మాత్రానా ఇంగ్లాండ్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. అంత ఈజీగా తలొంచడానికి ఇంగ్లాండ్ కూడా సిద్ధంగా లేదు. అదిప్పుడు దెబ్బతిన్న పులి. ఒకటి నుంచి ఏడో స్థానం వరకు ఆ జట్టు లో అంతా స్టార్ బ్యాటర్లే. వీరిలో ఏ ఒక్కరు నిలిచినా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల శక్తి వీరి సొంతం.
జేసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్ స్టోన్, జోస్ బట్లర్, మోయిన్అలీ లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చగల సమర్థులు. అయితే తొలి వన్డేలో వీళ్లలో బట్లర్ మినహాయిస్తే మిగతావారిలో అందరూకలిసి 30 పరుగులు కూడా చేయలేదు. బౌలింగ్ లో నిఖార్సైన పేసర్, అనుభవలేమి ఆ జట్టును తీవ్రంగా వేధిస్తున్నది. ఇంగ్లాండ్ జట్టు తొలి మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నది.
మరోవైపు భారత జట్టుమాత్రం అన్ని రంగాల్లో సమతూకంగా ఉంది. పేస్ త్రయం బుమ్రా, షమీ, ప్రసిధ్ కృష్ణ లు మరోసారి తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ‘ది ఓవల్’ లో తమ ప్రదర్శన గాలివాటం కాదని నిరూపించడానికి ఈ ముగ్గురూ తమ అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. వీరికి తోడు హార్ధిక్ పాండ్యా నాలుగో పేసర్ గా జతకలవడం టీమిండియా కు అదనపు బలం. ఇక గత మ్యాచ్ లో రెండు ఓవర్లే వేసిన చాహల్.. అసలు బౌలింగే చేయని రవీంద్ర జడేజా లు ఈ మ్యాచ్ లో రాణిస్తే ఇంగ్లాండ్ కు మరోసారి తిప్పలు తప్పవు.
బ్యాటింగ్ లో భారత జట్టు తొలి మ్యాచ్ లో ఆడని విరాట్ కోహ్లీ ఈ వన్డేలో ఆడుతున్నాడు. ఇక ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్ లతో పాటు రవీంద్ర జడేజాలతో దుర్బేధ్యంగా ఉంది. తొలి మ్యాచ్ లో ధావన్-రోహిత్ జోడీ కలిసి లక్ష్యాన్ని ఛేదించారు.అయితే తొలి మ్యాచ్ లో ధావన్ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. వీరిద్దరూ ఈ మ్యాచ్ లో కూడా చెలరేగితే ఇంగ్లాండ్ బౌలర్లకు మరోసారి నిరాశే. మిగిలిన బ్యాటర్లు కూడా అవసరాన్ని బట్టి చెలరేగితే సిరీస్ భారత్ వశమవడం పెద్ద విషయమేమీ కాదు.
తుది జట్లు :
ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిధ్ కృష్ణ
ఇంగ్లాండ్ : జేసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, మోయిన్ అలీ, డేవిడ్ విల్లీ, క్రెయిగ్ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, రీస్ టాప్లే
