Asianet News TeluguAsianet News Telugu

రేణుకా సింగ్ సూపర్ స్పెల్.. అదరగొట్టిన టీమిండియా ఓపెనర్లు.. వన్డే సిరీస్ కూడా మనదే..

SLW vs INDW: శ్రీలంక పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొడుతున్నది. ఆల్  రౌండ్ ప్రదర్శనతో  వరుసగా మ్యాచులను గెలుస్తూ దూసుకెళ్తున్నది. 
 

India Beats Sri lanka by 10 Wickets and clinch the 3 match series 2-0
Author
India, First Published Jul 4, 2022, 5:29 PM IST

కొత్త కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్నది. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఇదివరకే టీ20 సిరీస్ గెలవగా.. ఇప్పుడు వన్డే సిరీస్ కూడా గెలుచుకుంది. లంకతో మూడు వన్డేల  సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెగ్గిన భారత జట్టు.. సోమవారం పల్లెకెలే లో జరిగిన రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్  ను 2-0తో గెలుచుకుంది. శ్రీలంకను తొలుత తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఊది పారేసింది.  భారత  యువ బౌలర్ రేణుకా సింగ్, ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

పల్లెకెలే వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్.. లంకను బ్యాటింగ్ కు ఆహ్వనించింది. శ్రీలంక తొలి ఓవర్లోనే ఓపెనర్ హాసిని పెరేరా (0)  వికెట్ ను కోల్పోయింది. నాలుగో ఓవర్లో విష్మీ గుణరత్నె (3), ఆరో ఓవర్లో మాధవి (0) లు పెవిలియన్ చేరారు. ఈ మూడు వికెట్లు రేణుకా సింగ్ కే దక్కాయి.  

వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన లంకను ఆదుకునే బాధ్యతను కెప్టెన్ చమిర ఆటపట్టు (45 బంతుల్లో 27.. 3 ఫోర్లు),  అనుష్క  సంజీవని (44 బంతుల్లో 25.. 2 ఫోర్లు) నెత్తికెత్తుకున్నారు. కానీ ఆటపట్టును మేఘనా సింగ్ ఔట్ చేయగా.. అనుష్క ను యస్తిక భాటియా రనౌట్ చేసింది. ఆ వెంటనే కవిష దిల్హరి (5) ని కూడా  యస్తిక రనౌట్ చేసింది. 81 కే లంక ఆరు వికెట్లు కోల్పోయింది.  ఆ క్రమంలో అమ కాంచన (83 బంతుల్లో 47 నాటౌట్) బాధ్యతగా ఆడింది. ఆమె కూడా ఆడకుంటే లంక స్కోరు 150 కూడా దాటకపోయేది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లతో చెలరేగగా.. మేఘనా సింగ్, దీప్తి శర్మలు చెరో రెండువికెట్లు  పడగొట్టారు. 

 

స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఎక్కడా తడబడలేదు. ఓపెనర్లు స్మృతి మంధాన (83 బంతుల్లో 94.. 11 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (71 బంతుల్లో 71.. 4 ఫోర్లు, 1 సిక్స్) లు తొలి వికెట్ కు 174 పరుగులు జోడించి వికెట్ నష్టపోకుండా భారత్ కు విజయాన్ని అందించారు. 

తొలి వన్డేలో కూడా భారత్ నెగ్గిన విషయం తెలిసిందే. తాజాగా రెండో మ్యాచ్  లో సైతం టీమిండియానే విజయం వరించింది. ఫలితంగా సిరీస్ 2-0 తో భారత్ వశమైంది. అంతకుముందు నిర్వహించిన  టీ20  సిరీస్ ను కూడా భారత్ 2-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios