ENG vs IND: ఓవల్ వన్డేలో టీమిండియా ఘన విజయం.. చాలారోజుల తర్వాత మళ్లీ వన్డేలలో రోహిత్-ధావన్ ల బ్యాటింగ్ మ్యాజిక్.
ఇంగ్లాండ్ ను టీ20లలో దెబ్బకొట్టిన టీమిండియా..వన్డేలలో కూడా శుభారంభం చేసింది. ‘ది ఓవల్’ లో జరిగిన తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. ముందు ఇంగ్లాండ్ ను 110 పరుగులకే నిలువరించిన భారత జట్టు.. ఆ తర్వాత లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఒక్కవికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. భారత ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ లు నాటౌట్ గా నిలిచి ఇంగ్లాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించారు.
లక్ష్య ఛేదనలో భారత్ ఎక్కడా తడబడలేదు. ఆది నుంచి దూకుడుగానే ఆడిన రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్.. 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శిఖర్ ధావన్ (54 బంతుల్లో 31 నాటౌట్.. 4 ఫోర్లు) తో కలిసి భారత్ కు తొలి విజయాన్ని అందించాడు.
తొలి ఐదు ఓవర్ల వరకు ఆచితూచి ఆడిన రోహిత్.. తర్వాత గేర్ మార్చాడు. డేవిడ్ విల్లీ వేసిన ఐదో ఓవర్లో భారీ షాట్ కొట్టి స్కోరువేగం పెంచాడు. ఆ తర్వాత టాప్లే వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో ధావన్ రెండు, రోహిత్ ఫోర్ బాదారు. బ్రైడన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో తొలి బంతిని సిక్సర్ బాదిన రోహిత్ శర్మ.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఆతర్వాత రోహిత్ మరింత దూకుడు పెంచాడు. అదే ఓవర్లో మరో 4,6 బాది టీమిండియాను విజయానికి దగ్గర చేశాడు. ఇక మోయిన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రెండోబంతికి రోహిత్ సిక్సర్ బాదగా.. నాలుగోబంతికి ఫోర్ కొట్టి లాంఛానాన్ని పూర్తి చేశాడు.
అంతకుముందు ఇంగ్లాండ్ ను టీమిండియా పేసర్లు 110 పరుగులకే కుప్పకూల్చారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ కు ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే షాకిచ్చాడు బుమ్రా. ఆ ఓవర్లో అతడు వేసిన నాలుగో బంతికి జేసన్ రాయ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్లో బుమ్రా.. ఇంగ్లాండ్ కు మరో షాకిచ్చాడు. వన్ డౌన్ లో వచ్చిన జో రూట్ (0)ను డకౌట్ చేశాడు. ఆ ఓవర్ చివరి బంతికి రూట్.. వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ (0) కూడా ఆడిన తొలి బంతికే పంత్ కు క్యాచ్ ఇచ్చాడు. బెన్ స్టోక్స్ వికెట్ షమీకి దక్కింది. ఇక బుమ్రావేసిన ఐదో ఓవర్ మూడో బంతికి బెయిర్ స్టో పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ ఎన్నోఆశలు పెట్టుకున్న లివింగ్ స్టోన్ (0) ను కూడా బుమ్రా ఇన్నింగ్స్ 8వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేశాడు.
వరుసగా వికెట్లు కోల్పోతున్నతరుణంలో ఇంగ్లాండ్ ను ఆదుకోవడానికి ప్రయత్నించిన మోయిన్ అలీ (14)ని ప్రసిధ్ కృష్ణ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఔట్ చేశాడు. ప్రసిధ్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చిన అలీ నిరాశగా వెనుదిరిగాడు. తర్వాత ఓవర్లో ఇంగ్లాండ్ కు మరో భారీ షాక్ తాకింది. బాధ్యాతాయుతంగా ఆడుతున్న బట్లర్ (32 బంతుల్లో 30.. 6 ఫోర్లు) ను షమీ బోల్తా కొట్టించాడు. షమీ వేసిన ఇన్నింగ్స్15వ ఓవర్లో మూడోబంతికి భారీ షాట్ ఆడేందుకు యత్నించిన బట్లర్.. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చాడు. ఫలితంగా ఇంగ్లాండ్ ఆశలునేలకూలాయి. తనతర్వాత ఓవర్లో షమీ.. క్రెయిగ్ ఓవర్టన్ (1) ను బౌల్డ్ చేశాడు.
ఇక ఇంగ్లాండ్ టెయిలెండర్ డేవిడ్ విల్లీ (21.. 3ఫోర్లు)కాస్త దూకుడుగా ఆడేందుకు యత్నించాడు. కానీ బుమ్రా మళ్లీ తన సెకండ్ స్పెల్ లో అతడిని బౌల్డ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో అతడికి ఇది ఐదోవికెట్. ఇక బ్రైడన్ కార్స్ (15) ను కూడా బౌల్డ్ చేసిన బుమ్రా.. ఆరు వికెట్లు దక్కించుకున్నాడు.
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లుతీయగా మహ్మద్ షమీ 3, ప్రసిధ్ కృష్ణ 1 వికెట్ తీశాడు. టీమిండియా పేస్ త్రయం సమిష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పప్పులేమీ ఉడకలేదు.
