Asianet News TeluguAsianet News Telugu

IND vs SA: అస‌లు ప‌రీక్ష కేప్‌టౌన్‌లోనే.. టీమిండియా ఏం చేస్తుందో మ‌రి !

India vs South Africa 2nd Test: దక్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 0-1తో వెనుకంజలో ఉంది. సిరీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే భారత్ రెండో మ్యాచ్ లో తప్పక గెలవాలి. అయితే, స‌ఫారీ పేసర్లను ఎదుర్కొవ‌డ‌మే ప్ర‌స్తుతం భార‌త్ ముందున్న అతిపెద్ద సవాలు.
 

IND vs SA: The real test for Team India is in Cape Town, Will the Indian batters do well?  RMA
Author
First Published Jan 2, 2024, 4:07 PM IST

IND vs SA: టీ20, వ‌న్డేల‌లో అద‌ర‌గొట్టి.. టెస్టుల్లోనూ చరిత్ర సృష్టించేందుకు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 ప‌రుగుల తేడాతో ఘోర‌ ఓటమిని చవిచూసింది. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోని టీమిండియా బుధవారం నుంచి కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా నుంచి మ‌రో గ‌ట్టి స‌వాలు ఎదుర్కొనుంది. ప్రస్తుతం రెండు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 0-1తో వెనుకంజలో ఉంది. సిరీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే భారత్ రెండో మ్యాచ్ లో తప్పక గెలవాలి. అయితే స‌ఫారీ పేసర్లను ఎదుర్కొవ‌డ‌మే ప్ర‌స్తుతం భార‌త్ ముందున్న అతిపెద్ద సవాలు.

ఎందుకంటే, ప్రారంభ మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన సెంచూరియన్ స్టేడియంలోని పిచ్ మాదిరిగానే కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియంలోని పిచ్ కూడా పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. పిచ్ పై గడ్డి పెరగడంతో మరింత బౌన్స్ కూడా ఉంటుందని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు. తొలి మ్యాచ్ లో 19 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా పేసర్లు మరోసారి భారత బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే తొలి టెస్టులో భారత పేసర్లు అంతగా రాణించలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ 90 ఓవర్లు బౌలింగ్ చేసి 350కి పైగా పరుగులు ఇచ్చారు. రెండో టెస్టులో ఆఫ్రికా బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసేందుకు బౌన్సర్లతో విరుచుకుప‌డాల‌ని భారత బౌలర్లు ఉవ్విళ్లూరుతున్నారు.

VIRAT KOHLI: విరాట్ కోహ్లీ ఎమోష‌న‌ల్.. గ్రౌండ్ లోనే ఇలా.. !

మరోవైపు భారత బ్యాట్స్ మెన్ కూడా తీవ్రంగా సాధన చేస్తుండటంతో ఆఫ్రికా పేసర్లను ఎదుర్కోవడంలో ఎంతవరకు విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. స‌ఫారీ జ‌ట్టు బౌలింగ్ విభాగంలో బ‌లంగా ఉండ‌టం, పిచ్ కూడా బౌల‌ర్ల‌కు అనుకూలంగా ఉండటంతో భార‌త బ్యాట‌ర్స్ క‌ష్టాలు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. మ‌రి ఎంత‌వ‌ర‌కు మ‌న బ్యాట‌ర్స్ రాణిస్తారో చూడాలి. తొలి టెస్టులో ఘోర ఒట‌మి నేప‌థ్యంలో కొత్త సంవత్సరం తొలిరోజు భారత ఆటగాళ్లు మైదానంలో కఠోర సాధనలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ నెట్స్ లో గంటల తరబడి ప్రాక్టిస్ చేశాడు. ఎక్కువగా ఎడమచేతి వాటం పేసర్ల సవాలును ఎదుర్కొన్నాడు.

దక్షిణాఫ్రికా యువ లెఫ్టార్మ్ పేసర్ నాంద్రే బర్గర్ తొలి టెస్టులో కోహ్లీని ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు. అయితే భారత జట్టులో లెఫ్టార్మ్ పేసర్లు లేకపోవడంతో సోమవారం నెట్స్ లో ఎడమచేతి వాటం నెట్ బౌలర్లు, లెఫ్టార్మ్ త్రోడౌన్ స్పెషలిస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంపై కోహ్లీ ప్రధానంగా దృష్టి సారించాడు. షార్ట్ బాల్స్ ముందు పేలవమైన రికార్డు ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఎక్కువ‌గా  నెట్స్ లో షార్ట్ బంతులను ఎదుర్కొన్నాడు. శ్రీలంక లెఫ్టార్మ్ త్రోడౌన్ స్పెషలిస్ట్ నువాన్ సేనవీరరత్నే నుంచి బంతులు ఎదుర్కొన్నాడు. తొలి టెస్టులో ఓటమితో 2023ను ముగించిన భార‌త్.. 2024ను విజయంతో ప్రారంభించాల‌ని చూస్తోంది.

డేవిడ్ వార్నర్‌‌కు బిగ్ షాక్.. ఎమోషనల్ వీడియో.. ఇలా చేశారేంట్రా మీరు !

Follow Us:
Download App:
  • android
  • ios