ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మొదటి టీ20: 76 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, 12 బంతుల్లో 31 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా... సౌతాఫ్రికా ముందు 212 పరుగుల భారీ టార్గెట్...
India vs South Africa 1st T20I: ఢిల్లీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది...
ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కలిసి తొలి వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం జోడించి, శుభారంభం అందించారు. 15 బంతుల్లో 3 సిక్సర్లతో 23 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ని వేన్ పార్నెల్ అవుట్ చేశాడు... ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కలిసి రెండో వికెట్‌కి 80 పరుగులు జోడించారు.
48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, టీ20ల్లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 37 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్... కేశవ్ మహారాజ్ వేసిన 13వ ఓవర్‌లో వరుసగా 6,6, 4, 4 బాది 20 పరుగులు రాబట్టాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి ట్రిస్టన్ స్టబ్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ఇషాన్ కిషన్...
ఆ తర్వాతి బంతికి క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, మొదటి బంతికే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాను ఎదుర్కొన్న మొదటి 10 బంతుల్లో 20 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత 17 బంతుల్లో 16 పరుగులు చేయగలిగాడు...
శ్రీలంకతో జరిగిన గత మూడు టీ20 మ్యాచుల్లో 57, 74, 73 పరుగులు చేసి అజేయంగా నిలిచిన శ్రేయాస్ అయ్యర్, 27 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసి ప్రిటోరియస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
టీ20ల్లో మ్యాచ్‌లతో సంబంధం లేకుండా అవుట్ అవ్వడానికి ముందు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆరోన్ ఫించ్ రికార్డును సమం చేశాడు శ్రేయాస్ అయ్యర్. కెప్టెన్ రిషబ్ పంత్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి ఆన్రీచ్ నోకియా బౌలింగ్‌లో వాన్ దేర్ దుస్సేన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
మూడేళ్ల తర్వాత టీ20ల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, ఆఖరి నాలుగు బంతులు మిగిలి ఉండగా క్రీజులోకి వచ్చి 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
