ఒక్క బాల్‌కి 286 పరుగులు! 130 ఏళ్ల కిందట జరిగిన ఈ సంఘటనను పాక్ రిపీట్ చేస్తే...
పాకిస్తాన్ సెమీస్ ఛాన్సులపై సోషల్ మీడియాలో ట్రోల్స్... ఒక్క బంతికి 286 పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ సీన్‌ని రీక్రియేట్ చేయాలంటూ చిత్ర విచిత్ర సలహాలు...
242 పరుగుల తేడాతో గెలవడం! లేదా 2.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించండి... సెమీస్ చేరాలంటే పాకిస్తాన్ ముందున్న రెండు మార్గాలు. ఇది కాకుండా పాక్ సెమీస్ చేరేందుకు మరో అవకాశమే లేదు. దీంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ సెమీస్ ఛాన్సుల గురించి రకరకాల ట్రోల్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి..
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్, ‘సెమీస్ చేరాలంటే ఒక్కటే దారి, ఫస్ట్ బ్యాటింగ్ చేయండి, తర్వాత ఇంగ్లాండ్ టీమ్‌ని బయటికి రాకుండా లాక్ చేసేయండి. అప్పుడు టైమ్ అవుట్‌గా ద్వారా గెలిచి, సెమీ ఫైనల్ వెళ్లిపోవచ్చు..’ అంటూ ఫన్నీ కామెంట్లు చేశాడు..
మరో మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 1894లో విక్టోరియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒకే బంతికి 286 పరుగులు రాబట్టాడు బ్యాటర్. బ్యాటర్ కొట్టిన బంతి, స్టేడియంలో ఉన్న ఓ చెట్టు మీద ఇరుక్కుపోయింది. దాన్ని ఫీల్డర్లు వెతుక్కుని తీసుకొచ్చేలోపు, 286 సింగిల్స్ తీసేశారు.
అప్పటికే ఎలాంటి రూల్స్ లేకపోవడంతో ఇది చెల్లింది. పాకిస్తాన్ ఇప్పుడు 242 పరుగుల తేడాతో గెలవాలంటే ఇలాంటిదేదో చేయాలని అంటున్నారు నెటిజన్లు. ఇప్పుడు స్టేడియంలో చెట్లు లేవు కాబట్టి బాల్‌ని ప్యాడ్స్ మధ్యలో పెట్టుకుని పరుగెత్తాలని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే, అలాంటి ఛాన్స్ వచ్చినా పాకిస్తాన్ బ్యాటర్లు దాన్ని చేయలేరని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు..
286 పరుగులు తీసేందుకు క్రీజులో ఉన్న ఇద్దరు బ్యాటర్లు దాదాపు 6 కి.మీ.ల దూరం పరుగెత్తాల్సి వచ్చింది. సరైన ఫిట్‌నెస్ లేకుండా, ఫుట్‌వర్క్ చూపించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ బ్యాటర్లు, ఒక్క బంతికి 3 పరుగులు రాబట్టడమే చాలా ఎక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి..