స్పోర్ట్స్ మినిస్టర్‌కు ఘోర అవమానం.. అతడు వేసిన ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన పాకిస్తాన్ బ్యాటర్
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ప్రారంభానికి ముందు జరుగుతున్న ఎగ్జిబిషన్ మ్యాచ్ లలో పాక్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్.. ఏకంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు.

పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ రెచ్చిపోయాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ప్రారంభానికి ముందు జరుగుతున్న ఎగ్జిబిషన్ మ్యాచ్ లలో ఇఫ్తికార్ అహ్మద్.. ఏకంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఇంతకీ ఇఫ్తికార్ కు బౌలింగ్ వేసింది ఎవరో తెలుసా..? ఇటీవలే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు క్రీడా మంత్రిగా ఎంపికైన వహబ్ రియాజ్ బౌలింగ్ లో కావడం విశేషం. ఇందుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
పాకిస్తాన్ సూపర్ లీగ్ కు సన్నాహకంగా జరుగుతున్న ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఇఫ్తికార్ ఈ ఘనత నమోదుచేసుకున్నాడు. శనివారం క్వెట్టా గ్లాడియేటర్స్ - పెషావర్ జల్మీ మ్యాచ్ లో భాగంగా ఇఫ్తికార్.. వహబ్ రియాజ్ బౌలింగ్ ను చితకబాదాడు.
క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడిన ఇఫ్తికార్.. అప్పటికే హాఫ్ సెంచరీ చేసి దూకుడుమీదున్నాడు. పెషావర్ జల్మీ తరఫున వహబ్ చివరి ఓవర్ లో బౌలింగ్ కు వచ్చాడు. ఇక రియాజ్ వేసిన ఆఖరి ఓవర్లో ఇఫ్తికార్.. వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. అతడి దూకుడుతో క్వెట్టా.. నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియోపై పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ఆ జట్టు క్రికెటర్ షాదాబ్ ఖాన్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మా ఛోటే భాయ్ స్పోర్ట్స్ మినిస్టర్ బౌలింగ్ లో దుమ్ము రేపాడు. కానీ మినిస్టర్ సాబ్ మళ్లీ పుంజుకుంటాడు...’అని ట్వీట్ చేశాడు. ఇక అభిమానులు మాత్రం పంజాబ్ క్రీడా మంత్రికి ఇఫ్తికార్ చుక్కలు చూపించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.